ప్రత్యేక హోదా పేరుతో ఏపిలో పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ నాథ్ అన్నారు. ఆయన మాటలు అక్షరాల నిజమని మన రాజకీయ పార్టీలు నిరూపిస్తున్నాయి. ఆ వ్యాఖ్యని ప్రస్తావించి, అది తెదేపాని ఉద్దేశ్యించి చేసినదేనని వైకాపా కూడా తేల్చి చెప్పింది. అది రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్య అని తెదేపా అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తెదేపాతో సహా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను (భాజపా తప్ప) ఉద్దేశ్యించి అన్నమాటేనని వారికీ తెలుసు.
జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీని నిలదీసి అడగరు. ఆయన లెక్కలు, సమస్యలు, కారణాలు ఆయనకున్నాయి. అవేమిటో అందరికీ తెలుసు. కనుక ఆయన కేవలం చంద్రబాబు నాయుడునే హోదా గురించి నిలదీస్తుంటారు..నిందిస్తుంటారు.
కాంగ్రెస్ పార్టీకి భాజపాతో పొత్తులు పెట్టుకొనే అవకాశం లేదు కనుక రఘువీరా రెడ్డి మోడీని, చంద్రబాబు నాయుడుని కలిపి జాడిస్తుంటారు. కానీ రఘువీరా జగన్మోహన్ రెడ్డి జోలికి పోరు. అలాగే జగన్ కూడా కాంగ్రెస్ జోలికి పోరు. అది మరోరకమయిన ఈక్వేషన్. బహుశః వచ్చే ఎన్నికల నాటికి అది ‘సాల్వ్’ అవుతుందేమో చూడాలి.
ఇంక తెదేపా నేతలు ప్రతిపక్షాలు ఎంతగా నిలదీస్తున్నా, విమర్శిస్తున్నా వారికి జవాబులు చెపుతూ దులుపేసుకొంటారు తప్ప వారు కూడా ఎన్నడూ మోడీని నిలదీసి అడగరు. ఆ లెక్కలు అందరికీ తెలిసినవే. కానీ మద్యలో అప్పుడప్పుడు వాళ్ళ లెక్కలు కూడా తప్పుతుంటాయి. అప్పుడు వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని (మోడీని కాదుట) విమర్శిస్తారు. మళ్ళీ కూడికలు తీసివేతలు సరిచూసుకొని ‘తూచ్’ అంటూ ‘కేంద్రంతో మా బందం జన్మజన్మల అనుబందం’ అంటూ కోరస్ పాడేసి మళ్ళీ యధాప్రకారం ప్రతిపక్షాలతో యుద్ధాలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు.
ప్రస్తుతం కోరస్ పాట పాడటం పూర్తయిపోయింది కనుక మళ్ళీ ప్రతిపక్షాలతో యుద్ధానికి సిద్దం అయిపోయారు తెలుగు తమ్ముళ్ళందరూ. వాళ్ళకి పెద్దన్న వంటి మంత్రి నారాయణగారు కూడా తనవంతుగా ప్రతిపక్షాల గురించి విలువయిన అభిప్రాయం వ్యక్తం చేసారు. “అన్నదమ్ములలాగా మెలుగుతున్న తెదేపా, భాజపాల మద్యన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా పేరిట చిచ్చు పెడుతున్నాయని” ఆరోపించారు. ఆయన ఆ మాట ఏదో యాదృచ్చికంగా అన్నట్లున్నా నిజానికి ఆయన తెదేపా మనసులో మాటనే చెపుతున్నారని భావించవచ్చు. ఒకవేళ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా గురించి గొడవ చేయకుండా ఊరుకొంటే, తెదేపా కూడా దాని గురించి ఎన్నడూ మాట్లాడవలసిన అవసరం ఉండేదే కాదు. అప్పుడు రాష్ట్రంలో తెదేపా, భాజపాల స్నేహం మూడు పచ్చ జెండాలు, ఆరు కాషాయ జెండాలు…సారీ..ఆరు పచ్చ జెండాలు…మూడు కాషాయ జెండాలుగా సాగిపోయేది కదా!