భాజపా నేత నాగం జనార్ధన్ రెడ్డి తనకు పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే బాధతో చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒకానొక సమయంలో ఆయన అనుచరుడు చేత స్థాపించిన ‘బచావో తెలంగాణా’ ఫోరంలోకి వెళ్ళిపోతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ నేటికీ అయన భాజపాలోనే కొనసాగుతున్నారు. మళ్ళీ అకస్మాత్తుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన వాటిని ఖండించి, తను భాజపాలోనే కొనసాగుతానని చెప్పారు.
తెదేపాలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి, తెరాసలో చేరాలనే ఉద్దేశ్యంతో పార్టీని వీడినప్పటి ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. చివరికి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాలో చేరినా అయన పరిస్థితిలో మార్పు కనబడలేదు. పైగా ప్రజలు కూడా అయన గురించి మరిచిపోయే పరిస్థితి కనబడుతోంది. అది స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. ఆయనకి తను చాలా సీనియర్ ననే భావన ఉంది. అది నిజం కూడా. కానీ భాజపాలో మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా ఎవరూ తనకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వలేదని బాధపడుతున్నారు. తన రాజకీయ అనుభవంతో పార్టీలో పట్టు సాధించుకొని, అందరూ తన ప్రాధాన్యతని గుర్తించేలా చేసుకోవలసిన బాధ్యత అయనపైనే ఉంటుంది తప్ప పార్టీ మీద కాదు. రాజకీయాలలోనే కాదు ఏ రంగంలోనయినా ఇది సర్వసాధారణమయిన విషయమే. కానీ ఆయన తన వైఫల్యానికి పార్టీని నిందిస్తున్నట్లు కనబడుతోంది. నిజానికి తెలంగాణాలో భాజపా మళ్ళీ నిలద్రొక్కు కోవడానికి ఆయన వంటి అపార అనుభవమున్న రాజకీయ నేతల సహాయసహకారాలు చాలా అవసరం ఇప్పుడు. కానీ ఆయనని పార్టీ ఉపయోగించుకోవడం లేదు. అలాగే ఆయన కూడా పార్టీలో ఇమడలేకపోతున్నట్లున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన డా.లక్ష్మణ్, నాగం జనార్ధన రెడ్డి ఇద్దరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొంటే పార్టీకి, నాగంకి కూడా మంచిది కదా.