రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు దేశంలో చాలా హడావుడి మొదలవబోతోంది. రేపే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. అలాగే ఖమ్మం జిల్లాలో పాలేరు ఉపఎన్నికలు కూడా రేపే జరుగబోతున్నాయి. రేపటి నుంచే జగన్మోహన్ రెడ్డి కర్నూలులో జలదీక్ష పేరిట మూడు రోజులు నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఎల్లుండి అంటే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ కలవబోతున్నారు. గురువారం నాడు అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అదే రోజున ఖమ్మం జిల్లాలోని పాలేరుతో సహా దేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికలు ఫలితాలు కూడా వెలువడతాయి. అంటే వచ్చే వారం అంతా దేశంలో చాలా ఆసక్తికరమైన, చాలా ప్రాధాన్యత గల రాజకీయ పరిణామాలు జరుగబోతున్నాయన్న మాట!
వీటి కారణంగా ఆయా రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు హడావుడి, ఓడిపోయినా పార్టీల వైఫల్యానికి కారణాలపై దేశవ్యాప్తంగా చర్చలు, పాలేరు ఉపఎన్నికల ఫలితం ఆధారంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్, జగన్ జల దీక్ష కారణంగా తెదేపా-వైకాపా-తెరాస పార్టీల మద్య మళ్ళీ మాటల యుద్ధాలు, విమర్శలు, ఆరోపణలు వగైరా, ప్రధానితో చంద్రబాబు సమావేశం ఫలితాలను బట్టి తెదేపా-భాజపాల సంబంధాలపై చర్చలు వగైరా పరిణామాలతో దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా రాజకీయ హడావుడి జరుగబోతోంది.