ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి దీక్ష చేపడుతున్నారు. కర్నూలులో సోమవారం ఆయన దీక్ష మొదలవుతుంది. తెలంగాణ నీటిపారుల ప్రాజెక్టుకు నిరసనగా ఈనెల 16 నుంచి 19 వరకు దీక్ష చేస్తానని ఆయన ముందే ప్రకటించారు.
దీక్ష ద్వారా నిరసన తెలపడం, అనుకున్నది సాధించడానికి ప్రయత్నించడం మన దేశంలో కొత్తేమీ కాదు. స్వాతంత్ర్యానికి ముందు నుంచీ ఉంది. అయితే వాటికీ, జగన్ చేసే దీక్షలకూ తేడా ఉంది. సాధారణంగా ఒక అంశాన్ని, డిమాండును సాధించడమే లక్ష్యంగా దీక్షకు దిగే వారు నిరవధిక దీక్ష చేపడతారు. అనుకున్నది సాధించే వరకూ కొనసాగిస్తారు. అయితే డిమాండ్ నెరవేరుతుంది. లేదా ఆరోగ్యం క్షీణించినప్పుడు ప్రభుత్వం వారు, లేదా పోలీసులే దీక్షను భగ్నం చేస్తారు.
డిమాండును సాధించుకోవడానికి ఇలా దీక్ష చేయడం రివాజు. ఇక్కడ జగన్ డిమాండ్ ను అంగీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాదనేది నిజమే. అయితే, తాము ఏపీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పోరాటం చేస్తామని, ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని ఏపీ ప్రభుత్వం నుంచి హామీ పొందేవరకైనా దీక్ష చేస్తే మరోలా ఉండేది. అలా ప్రభుత్వం దిగివచ్చే వరకూ దీక్షలో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతుంది. అలా కాకుండా ముందే దీక్ష విరమణ తేదీని ప్రకటిస్తే ఇక ప్రభుత్వంపై ఒత్తిడి ఏముంటుంది?
తానే దీక్ష చేస్తున్నాడు, తానే విరమిస్తాడు మాకేంటని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసే అవకాశం ఉంది. గతంలోనూ అనేక డిమాండ్లపై జగన్ దీక్ష చేశారు. ఒకటి రెండుసార్లు మాత్రమే డిమాండ్ ను సాధించి తీరుతాననే స్థాయిలో కొనసాగించారు. గత ఏడాది అక్టోబర్లో ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం గుంటూరు జిల్లా నల్లపాడులో ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.
ఇలా నిరవధికంగా జగన్ దీక్ష చేయడం బహు అరుదు. అనేక సందర్భాల్లో ముందే విరమణ తేదీ ప్రకటించి దీక్ష మొదలుపెట్టారు. ఆ తర్వాత తానే దీక్షను విరమించారు కాకపోతే రైతులచేత, లేదా పిల్లల చేత నిమ్మరసం తీసుకుని దీక్ష ముగించారు. ఈసారి కూడా అలాంటి దీక్షనే చేపట్టారు.
ఇలాంటి దీక్షల వల్ల ప్రభుత్వాలపై ఒత్తిడీ ఉండదు. ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఏదో నేను సైతం సమస్యపై స్పందించానని చెప్పుకోవడానికి మాత్రమే పనికివస్తుంది. ఇదే అంశం తెలుగుదేశం పార్టీవారు విమర్శంచడానికి ఉపయోగపడుతోంది. ప్రజా సమస్యలపై జగన్ కు చిత్తశుద్ధిలేదని, కేవలం షో చేయడానికే దీక్షలు, యాత్రలు చేస్తారని టీడీపీ వారు చాలా కాలంగా విమర్శిస్తూనే ఉన్నారు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గతంలో దీక్ష చేశారు. కొందరు సీమాంధ్ర నేతలు ఈ దీక్షపై ఎన్ని విమర్శలు చేసినా పదిరోజుల పాటు ఆ దీక్ష సంచలనం కలిగించింది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఫలితంగా తెలంగాణ ఏర్పాటుకు సానుకూలమంటూ కేంద్రం ప్రకటించాల్సి వచ్చింది. అదే కేసీఆర్ గనక ముందే విరమణ తేదీ ప్రకటించి ఉంటే అలా జరిగేది కాదు. ప్రభుత్వం ఆ నిరాహార దీక్షను తేలిగ్గా తీసుకునేది.
దీక్ష చేసే విషయంలో ఉన్న తేడాను జగన్ గుర్తించడం లేదు. ఆయన్ని దీక్ష చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదు. తానే నిర్ణయం తీసుకున్నారు. చేసేదేదో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేస్తే ఫలితం ఉంటుంది. లేకపోతే ఇదేదో మొక్కుబడి రాజకీయ నిరసనగానే మిగిలిపోవచ్చు.