బాలీవుడ్ క్యూట్ బేబీ అమృతా రావ్ శ్రీమతిగా మారింది. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రియుడు, రేడియో జాకీ అన్ మోల్ తో ఈ అందాల భామ వివాహం జరిగిపోయింది. ఆదివారం తాము పెళ్లి చేసుకుంటున్నట్టు ఉదయమే అమృత ట్వటర్ లో ప్రకటించింది. తాము వివాహం చేసుకున్నామని, అందరి దీవెనలు కావాలంటూ ఆమె భర్త అన్ మోల్ సాయంత్రం ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని లోకానికి చాటాడు. అయితే ఎక్కడ, ఎన్ని గంటలకు పెళ్లి జరిగిందనేది మాత్రం వీరిద్దరూ తెలపలేదు.
ముంబైలో పుట్టి పెరిగిన 34 ఏళ్ల అమృతారావ్ పెళ్లి గురించి చాలా కాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, తన ప్రేమాయణం గురించి ఆమె ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. వ్యక్తిగత జీవితం గురించి పబ్లిగ్గా మాట్లాడటానికి ఇష్టపడ లేదు.
అమృతారావ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. 2007లో విడుదలైన అతిథి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రిన్స్ మహేశ్ బాబుతో ఆడిపాడింది. అందం, అభినయంతో మంచి మార్కులే సంపాదించింది. అయితే బాలీవుడ్ నటిగానే కొనసాగింది.
పద్నాలుగేళ్ల క్రితం అబ్ కే బరస్ సినిమా ద్వారా అమృత వెండితెరపై మెరిసింది. క్యూట్ గర్ల్ గా గుర్తింపు పొందింది. అదే ఏడాది, ద లెజెంబ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమాలో చిన్న పాత్ర పోషించింది.
పదేళ్ల క్రితం ఓ మెగా ప్రాజెక్టులో చాన్స్ రావడంతో మరింత ప్రాచుర్యం పొందింది. హమ్ సాథ్ సాథ్ హైవంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసని సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. రాజశ్రీ ప్రొడక్షన్ వంటి ప్రతిష్తాత్మక బ్యానర్ లో అవకాశం రావడం అరుదైన విషయమే. ఈ రొమాంటిక్ సినిమాలో షాహిద్ కపూర్ కు జోడీగా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా విజయవంతమైన సినిమాగానే పేరు వచ్చింది. అందులో అమృత నటనకు కూడా గుర్తింపు వచ్చింది.
వివాహ్ సినిమాతో పాపులర్ అయిన కారణంగానే అతిథి సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత కూడా అనేక హిందీ సినిమాల్లో నటించింది. అయితే టాప్ హీరోయిన్ గా అంత పేరు రాలేదు. ఆమె నటించిన సినిమాల్లో హిట్ అయిన వాటికంటే ఫ్లాప్ అయినవే ఎక్కువ కావడమే దీనికి కారణం కావచ్చు.
బాలీవుడ్ అందాల నటీమణులు సినిమా ప్రముఖులను లేదా బడా వ్యాపారులను పెళ్లి చేసుకోవడం రివాజు. అమృత మాత్రం రేడియో జాకీతో ప్రేమలో పడింది. వీరి ప్రేమాయణం ఏడేళ్లుగా నడుస్తోంది. చివరకు వివాహ బంధంలో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నదే తడవుగా తన ప్రియుడితో మూడుముళ్లు వేయించుకుంది. మరి మిసెస్ అమృత సినిమాల్లో ఇంకా నటిస్తుందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు.