తెలంగాణాలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో జలదీక్ష పేరిట నిరాహార దీక్షకి కూర్చోబోతున్నారు. దాని వలన తెదేపా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది కనుక అది కూడా ఆ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మాట్లాడక తప్పదు. ఇప్పటికే మాట్లాడింది కూడా. అందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు కూడా. నేటి నుంచి జగన్ చేయబోయే దీక్ష వలన మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య ఉద్రిక్తతలు పెరిగి విమర్శలు, ప్రతి విమర్శలు మొదలవవచ్చు. దాని వలన ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న ప్రశాంత వాతావరణం చెడిపోవచ్చు. ఈ పరిణామాల గురించి జగన్ కి తెలియదనుకోలేము. అలాగే తను ఆంధ్రాలో నిరాహార దీక్ష చేసినంత మాత్రాన్న తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టడం ఆపివేయదని కూడా ఆయనకి తెలుసు. కనుక ఆయన దీక్ష ఉద్దేశ్యం తెలంగాణాలో ప్రాజక్టులు కట్టకుండా అడ్డుకోవడమా లేకపోతే తన బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టడమా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఈ సమస్యపై రాష్ట్ర ప్రజలను జగన్ చైతన్యపరచాలనుకొంటున్నారు కనుక కర్నూలులో దీక్ష చేయడం సబబే. ఆ ప్రాజెక్టుల వలన నల్గొండ, ఖమ్మం జిల్లాలు కూడా నష్టపోతాయని ఆయన వాదిస్తున్నారు కనుక కర్నూలులో దీక్ష ముగించుకొన్న తరువాత నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఏదో ఒకచోట కూడా అయన ఆమరణ నిరాహార దీక్ష చేసి, తెలంగాణా ప్రభుత్వంతో ముఖాముఖి యుద్ధం చేసినట్లయితే, ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకొన్నట్లవుతుంది. ఆయన చంద్రబాబు నాయుడుని ఎంత గట్టిగా నిలదీసి అడుగుతుంటారో అదే స్థాయిలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని, ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుని కూడా నిలదీసి అడిగినప్పుడే ప్రజలకు ఆయనపై కొంత నమ్మకం ఏర్పడుతుంది.
ప్రత్యేక హోదాని మంజూరు చేయవలసిన కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డి నిలదీయకుండా తన బద్ధ శత్రువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని యుద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన అనుసరిస్తున్న ద్వంద వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకే వారు ఆయనని నమ్మడం లేదు. అందుకే ఆయన చేస్తున్న పోరాటానికి ప్రజల నుండి పూర్తి మద్దతు పొందలేకపోతున్నారు. అందుకే ఆయన గుంటూరులో చేసిన ఆమరణ నిరాహార దీక్ష విఫలం అయ్యింది.
తెలంగాణాలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న జగన్, వాటిని నిర్మిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించకుండా, వాటిని అడ్డుకోలేదంటూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం గమనిస్తే, ఈ విషయంలో కూయా అయన ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని స్పష్టం అవుతోంది. కనుక కర్నూలు దీక్షలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలకే పరిమితం కావచ్చు. అదే చేస్తే అప్పుడు దానికీ ప్రజల మద్దతు లభించదు. ఇటువంటి పోరాటాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరుకోవడం తప్పు కాదు కానీ ఇటువంటి ద్వంద వైఖరి కారణంగానే ప్రజలకు ఇంకా దూరం అవుతున్నానని గ్రహిస్తే మంచిది.