ప్రత్యేక హోదా కోరుతూ తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని నిన్న నిరసనలు తెలిపారు. హోదా ఇస్తామన్న హామీని మోడీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, ప్రజలను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెదేపా-భాజపా కూటమి అన్ని విధాల మేలు చేస్తుందనే నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ వాటి తరపున ఎన్నికలలో ప్రచారం చేసారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయడం తగదని వారు అన్నారు. కనుక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వారు అన్నారు. రాష్ట్రంలో పార్టీలన్నీ జెండాలను పక్కనబెట్టి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. ఈ విషయంలో తెలంగాణా ప్రజలను, పార్టీలను ఆదర్శంగా తీసుకొని పోరాడాలని కోరారు.
పవన్ కళ్యాణ్ ఇంకా జనసేన పార్టీని నిర్మించుకోలేదు కనుక నిన్న నిరసనలు తెలియజేసినవారిని అయన అభిమానులుగానే చూడవలసి ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సూచన మేరకే వారు నిరసనలు తెలియజేసి ఉంటే, దానికి చాలా ప్రాధాన్యత ఏర్పడుతుంది.
ఇదివరకు పవన్ కళ్యాణ్ ఒకసారి “ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి మరికొంత సమయం ఇచ్చి చూద్దాము,” అని ట్వీట్ మెసేజ్ పెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది కనుక ఇప్పుడు బంతి పవన్ కళ్యాణ్ కోర్టులోనే ఉన్నట్లు లెక్క. ఈ విషయంలో భాజపా తన హామీని నిలబెట్టుకోలేదు కనుకనే పవన్ కళ్యాణ్ తన అభిమానులకు నిరసనలు తెలపడానికి అనుమతించి ఉండి ఉంటే, ఆయన భాజపాపై యుద్దానికి సిద్దం అవుతున్నట్లు భావించవచ్చు.
ఒకవేళ ఆయనకి తెలియకుండా అభిమానులు నిరసనలు తెలిపి ఉంటే దానికి ప్రాధాన్యత ఉండదు. దానికి ఆయనను బాద్యుడిని చేయలేము. కానీ, అభిమానుల అభిలాషని అయన గుర్తించవలసిన అవసరం, సమయం వచ్చిందని అది స్పష్టం చేస్తోంది. ప్రత్యేక హోదాపై ఆయన వైఖరి ఏమిటో స్పష్టం చేయకపోతే, దానిపై ఆయన అభిమానులు కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే దాని వలన ఆయనకే మున్ముందు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు. కనుక తన వైఖరిని స్పష్టం చేసి దానిపై తన అభిమానులు ఏవిధంగా ముందుకు సాగాలో సూచిస్తే చాలా మంచిది.