దేశానికి రాజైనా ఓ తల్లికి బిడ్డే! సువిశాల భారతదేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓ తల్లికి ముద్దుల బిడ్డడే. ఆయనకి తన తల్లి హీరాబెన్ తో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికలలో భాజపా ఘనవిజయం సాధించి, ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ఆయన అందరి కంటే ముందు తన తల్లి వద్దకే వెళ్లి ఆమె కళ్ళకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవడం అందరికీ తెలిసిందే. ఆయన తన తల్లికే కాదు..ఓ బహిరంగ సభలో ఓ వృద్దురాలికి ఆయన పాదాభివందనం చేశారు. మహిళలంటే ఆయనకు అంత గౌరవం. అది చూసి ప్రజలందరూ ఆయనని చాలా మెచ్చుకొన్నారు.
ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత డిల్లీలోనే గడుపుతున్నారు. కనుక ఆయన గుజరాత్ లో ఉంటున్న తన తల్లిని కలవలేకపోతున్నారు. సుమారు రెండేళ్ళ తరువాత ఆమె మొట్టమొదటిసారిగా డిల్లీకి వచ్చి తన కుమారుడు మోడీతో కలిసి ఐదు రోజులు గడిపి, మళ్ళీ నిన్ననే గుజరాత్ తిరిగి వెళ్లిపోయారు. ఆయన తన తల్లిని వీల్ చైర్లో కూర్చోబెట్టి తన అధికార నివాసంలోని పూలతోట అంతా త్రిప్పి చూపించారు. ఆ ఫోటోలని కూడా ఆయన ట్వీటర్లో పోస్ట్ చేసారు. ఆ ఐదు రోజులు తను తన తల్లితో చాలా ఆనందంగా గడిపానని మోడీ ట్వీట్ చేసారు. ఈ వార్త, ఆ ఫోటోలు అప్పుడే ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో చాలా ప్రముఖంగా ప్రచురింపబడుతున్నాయి కూడా.
మోడీ తల్లి పట్ల కనబరుస్తున్న ప్రేమాభిమానాలు, గౌరవం చూసి అందరూ ఆయనపై ప్రశంశలు కురిపిస్తున్నారు. నిజమే ఈరోజుల్లో తల్లి తండ్రులను అంత గొప్పగా చూసుకోవడం చాలా అపురూపమయిన విషయమే. అయితే అదే ప్రేమ, గౌరవం మోడీ తన భార్య పట్ల కూడా చూపించి ఉంటే అందరూ హర్షించేవారు. మోడీ తన భార్యతో ఎందుకు విడిపోయారో అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ 2014 ఎన్నికలలో తన ఎన్నికల అఫిడవిట్ లో జశోదా బెన్ తన భార్య అని పేర్కొన్నారు. అంటే ఇప్పటికీ ఆమెను తన భార్యగా భావిస్తున్నట్లేనని అర్ధమవుతోంది.
వారి వివాహం 1968లో జరిగినట్లు తెలుస్తోంది. కానీ వారు ఎన్నడూ కలిసి జీవించలేదు. అలాగని విడాకులు కూడా తీసుకోలేదు. ఆమెను ఏ కారణాలతో మోడీ ఆదరించకపోయినప్పటికీ, ఆమె మాత్రం అప్పటి నుండి ఒక స్థానిక దేవాలయంలో మోడీ ఆయురారోగ్యాల కోసం క్రమం తప్పకుండా పూజలు చేస్తూనే ఉన్నారు. ఆమె గుజరాత్ లోని ఒక మారు మూల గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చేసారు. కానీ ఏనాడూ ఆమె తన భర్త గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రధాన మంత్రి అయిన తరువాత గానీ ఏనాడూ ఆయన పేరు ప్రఖ్యాతులను ఆమె ఉపయోగించుకొనే ప్రయత్నం చేయలేదు. ఎన్నికల అఫిడవిట్ లో మోడీయే ఆమెను తన భార్యగా పేర్కొనడం చేత, ఆమెకు ‘ప్రధాని భార్య హోదా’ లభించడంతో ఆమెకు భద్రత కల్పించవలసి వచ్చింది. అప్పుడూ ఆమె సున్నితంగా తిరస్కరించారు తప్ప ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మోడీని నిలదీసే ప్రయత్నం చేయలేదు.
అటువంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఆమెను మోడీ పట్టించుకోలేదు. ఎందుకో తెలియదు. కనీసం దేశంలో ఒక మహిళగా కూడా ఆమెను గుర్తించినట్లు లేదు. మోడీ తన తల్లి పట్ల చూపుతున్న గౌరవం, ప్రేమాభిమానాలను ఎవరూ ప్రశ్నించలేరు. నిజమే! ఆయన తన భార్య పట్ల కూడా అదేవిధంగా గౌరవంగా ప్రవర్తించి ఉండి ఉంటే అందరూ ఆయననే ఆదర్శ పురుషుడుగా భావించేవారు కదా.