చెప్పింది చేస్తారు కొంత మంది. చేసేదే చెప్తారు మరికొంత మంది. చేసినా చేయకపోయినా చెప్పుకోవడం ముఖ్యమనుకుంటారు చాలా మంది రాజకీయ నాయకులు. కొత్త తరహా రాజకీయ పార్టీగా చెప్పుకొనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ తాను ముక్కే అని ఇప్పటికే అనేక సార్లు రుజువైంది. ఇప్పుడు మరోసారి రూఢి అయింది.
ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆప్, ప్రకటనల కోసం భారీగానే ఖర్చు చేస్తోంది. ఈనెల 11 వరకు గత మూడు నెలల కాలంలో ఆప్ సర్కార్ వార్తా పత్రికల్లో అడ్వర్టయిజ్ మెంట్ల కోసం 14 కోట్ల 56 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు బయటపడ్డాయి.
ఢిల్లీలో ఓ వైపు శానిటేషన్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ప్రకటనల కోసం ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ విమర్శించారు.
ప్రభుత్వం ఏం చేస్తున్నదో, కొత్తగా ఏ పథకాలు ప్రారంభిస్తోందో తన ప్రజలకు చెప్పుకోవడం తప్పు కాదు కదా అని అధికార పార్టీ వారు దబాయిస్తుంటారు. అలా అయితే ఆ రాష్ట్రానికి పరిమితమయ్యేలా ప్రకటనలు ఇవ్వాలి కదా. దేశమంతా ప్రకటనలు ఎందుకు? ఈ వంకతో పార్టీ ప్రచారం చేసుకోవడానికే కదా.
ఆప్ వార్తా పత్రికల్లో యాడ్స్ కోసం పెట్టిన ఖర్చులో చాలా వరకు నివారించదగిందే. ఎందుకంటే కేరళ, కర్ణాటక, ఒడిషా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని పత్రికల్లో కూడా కోట్లు తగలేసి యాడ్స్ ఇచ్చారట. ఢిల్లీ ప్రభుత్వ పనితీరు గురించి ఇతర రాష్ట్రాల వారు తెలుసుకుని తరిస్తారని కేజ్రీవాల్ సర్కార్ భావించిందని మనం అనుకోవాలా? లేక ఆప్ వారు సర్కారీ నిధులతో తమ పార్టీ ప్రచారానికి అధికారాన్ని దుర్వినియోగం చేశారని నమ్మాలా?
ఇతర పార్టీలకూ ఆప్ కూ తేడాలేదనడానికి ఇది తాజా ఉదాహరణ. ఢిల్లీలో అనేక సమస్యలున్నాయి. సర్కారీ స్కూళ్లలో ప్రమాణాలు పడిపోతున్నాయి. వాటిని సరిచేయకుండా ప్రయివేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ అధికారాన్ని ఎలా అడుగుతారని ఇటీవల సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ముందు సర్కారీ స్కూళ్లలో ప్రమాణాలు పెంచాలని సూచించింది. ఆరోగ్య సంరక్షణ విషయంలోనూ ఢిల్లీలో పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు.
నీళ్లు, కరెంటు ఉచితంగా ఇస్తామనే ఓటు బ్యాంకు రాజకీయాల హామీతో ఆప్ అధికారంలోకి వచ్చింది. నిజంగా ఢిల్లీని అభివృద్ధి చేయడానికి, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి, విద్య, వైద్యం నాణ్యంగా, ఉఛితంగా అందించడానికి తీసుకున్న చర్యలేవీ గొప్పగా లేవు. ప్రకటనల్లో మాత్రం ఢిల్లీ అంటే భూతల స్వర్గమేమో అనిపిస్తుంది. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ బృందం కూడా ఉద్యమకారుల కేటగిరీ నుంచి అసలు సిసలైన రాజకీయ నాయకుల కేటగిరీలోకి విజయవంతంగా మారిపోయిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.