జగన్మోహన్ రెడ్డి అమలుచేసే ప్రతీ వ్యూహానికి రెండు లేదా అంతకంటే ఎక్కువే రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తుంటారు. అంటే ఒకే దెబ్బకు రెండు మూడు పిట్టలు కొట్టాలని ప్రయత్నించడం అన్న మాట. అది సమైక్యాంధ్ర ఉద్యమం కావచ్చు లేదా ప్రత్యేక హోదా లేదా ప్రస్తుతం తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చేస్తున్న దీక్షలు కావచ్చు. దేనికయినా రెండు మూడు ప్రయోజనాలు ఆశిస్తుంటారు. అవేమిటో అందరికీ తెలుసు కనుక మళ్ళీ వాటి గురించి వల్లె వేసుకోనక్కరలేదు. ఆవిధంగా వ్యూహాలు పన్నగలగడం చాలా గొప్ప విషయమేనని అంగీకరించక తప్పదు. అయితే చాలా అరుదుగా ఆయన ఆశించిన ఫలితాలు పొందగలిగారు. తరచూ అవి బెడిసికొడుతుండటం వలన పార్టీ నష్టపోతుంటుంది.
రెండేళ్ళ క్రితం ఆయన రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పోరాటం మొదలుపెట్టారు. దానితో ఆంధ్రా ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవాలనే ఉద్దేశ్యమే తప్ప రాష్ట్ర విభజనని ఆపుదామనో లేకపోతే తెలంగాణా ఏర్పడకుండా అడ్డుకొందామనో కాదని అందరికీ తెలుసు. కానీ ఆయన ఆశిబ్న్చినట్లు ఎన్నికలలో గెలవలేదు కానీ ఆ నిర్ణయంతో తెలంగాణాలో వైకాపా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ ఆయన కర్నూలులో దీక్ష చేయడం ద్వారా ఆంధ్రా ప్రజలలో తనపై ఉన్న ఆంధ్రా వ్యతిరేక ముద్ర చేరిపివేసుకొని వారికి దగ్గరవ్వాలని ఆశిస్తున్నట్లున్నారు. అదే సమయంలో తెలంగాణా ప్రాజెక్టులను అడ్డుకోని చంద్రబాబు నాయుడుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చని ఆశించి ఉంటారు. అయితే ఆయన ప్రధాన ఉద్దేశ్యం తెలంగాణాలో ప్రాజెక్టుల నిర్మాణం ఆపడమేనని చెపుతున్నారు. అది నెరవేరదని ఆయనకి కూడా తెలుసు.
జగన్ దీక్ష ప్రారంభిస్తున్నానని ప్రకటించగానే, ఆ ప్రభావం మొట్టమొదట తెలంగాణాలో వైకాపా మీదే పడింది. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్, ఏకైక ఎమ్మెల్యే వెంకటేశ్వరులు పార్టీని వీడి తెరాసలో చేరిపోయారు. ఇవ్వాళ్ళ జగన్ హైదరాబాద్ నుంచి దీక్ష స్థలికి బయలుదేరగానే తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణాకు వ్యతిరేకంగా జగన్ వ్యవహరించడం వలననే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా వారం రోజుల క్రితమే జగన్ తెలంగాణా రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడుని, కార్యవర్గాన్ని ఏర్పాటు చేసారు. వారిలో అప్పుడే ఒకరు వెళ్ళిపోయారు. బహుశః ఈ మూడు రోజుల్లో మరికొందరు రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదు. జగన్ తను ఆశించినట్లుగా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టలేకపోయినా, ఆయన కొడుతున్న దెబ్బలకి తెలంగాణాలో వైకాపా నేతలు పిట్టల్లా ఎగిరిపోతున్నారు.