జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, భాజపాలకు నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికలు కొంత ఆనందాన్ని, ఎక్కువ విచారాన్ని కలిగించబోతున్నాయని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకి అసోంలో విజయం సాధించే అవకాశాలున్నట్లు సర్వే ఫలితాలు సూచిస్తునందున అందుకు అది సంతోషపడుతోంది. కానీ పశ్చిం బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో సింగల్ డిజిట్ కే పరిమితమయ్యే పరిస్థితి డానికి మింగుడు పడని విషయమే. అది ఈ ఫలితాలు ముందే ఊహించినవే కనుక విచారించి ప్రయోజనం లేదు. తమిళనాడులో కరుణానిధి భాజపాతో పొత్తులకు సిద్దమైనప్పుడు, భాజపా దృష్టి అన్నాడిఎంకె మీద ఉన్నందున ఆయనతో పొత్తులకు ఆసక్తి చూపలేదు. అది చాలా పెద్ద పొరపాటని ఇప్పుడు తాపీగా బాధపడవలసి వస్తోంది. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ చక్కగా వినియోగించుకొని డిఎంకె పొత్తులు పెట్టుకొని లబ్ది పొందబోతోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారబోతోంది. దాని చేతిలో నుంచి అసోం, కేరళ రెండు రాష్ట్రాలు జారిపోబోతున్నాయి. కేరళ ప్రజలు ఐదేళ్ళకోసారి కాంగ్రెస్ కూటమి, వామ పక్ష కూటమిలని మార్చే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీ పాలిత శాపంగా మారడంతో ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోవలసి వస్తోంది. తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె పార్టీ ఈ ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలున్నట్లు సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి కనుక దానితో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోవడం చాలా మంచిదయింది.
ఇంక తమిళ సినీ నటుడు, డిఎండికె అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అహంభావంతో వ్యవహరించి, ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకొన్నారు. ఆయన పార్టీలో సీనియర్ నేతలు డిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకొందామని ఎంత మొత్తుకొన్నా వినకుండా, అలాగ కోరినవారిని అందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒకవేళ వారు సూచించిన విధంగా డిఎంకెతో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, ఆయన పార్టీ కూడా డి.ఎం.కె. ప్రభావంతో ఈ ఎన్నికలలో విజయం సాధించి డిఎంకె ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండేదేమో?కనుక విజయ్ కాంత్ రాజకీయ జీవితంలో ఇది సరిదిద్దుకోలేని పెద్ద పొరపాటేనని చెప్పక తప్పదు.