ఆ 70 వేలకోట్ల రూపాయలూ రొటీన్ నిధులే!
కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన నిధులు బిజెపి నాయకులు చెబుతున్నట్టు ప్రత్యేక లేదా అదనపు సహాయం కాదని, జనాభా దామాషాలో ఏ రాష్ట్రానికైనా రొటీన్ గా వచ్చే నిధులు మాత్రమేనని రాష్ట్రప్రభుత్వం ఒక నివేదికలో వివరించినట్టు తెలిసింది.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదికి వివరాలు చెప్పడం కోసమే ఈ నివేదికను రూపొందించారు.
” ఇది బిజెపి మీద మోదీ ముందు పంచాయతీ పెట్టడం కాదు. బిజెపి రాష్ట్ర నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని దృష్టిలో పెట్టడం మాత్రమే. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో… ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి నష్టమేనన్నది చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్నది బాబు గారి ఆలోచన ” అని తెలుగుదేశంలో ఉన్నతస్ధాయి నాయకుడు ఒకరు చెప్పారు.
2014-15లో 35 వేల కోట్లు, 2015-16లో 43,467 కోట్ల నిధులు అందిన మాట వాస్తవమేనని ఏపీ ప్రభుత్వ నివేదిక చెబుతోంది. అయితే ఇదేమీ ప్రత్యేకంగా చేసిన సాయం కాదు.. 14వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం అన్ని రాష్ట్రాలతో సమానంగా జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చిన నిధులు మాత్రమే. దేశ జనాభాలో 4 శాతం వాటా ఉన్న ఏపీకి అన్ని రాష్ట్రాల మాదిరిగానే పన్నుల్లో వాటా ఇచ్చారు. అదే విధంగా రాష్ట్ర వార్షిక ప్రణాళికకు కేంద్ర మద్దతు లభించింది. విదేశీ ఆర్ధిక సాయం అందిందని కూడా నివేదికలో వివరించారు.
విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు. పన్నుల్లో వందశాతం రాయితీ, విదేశీ ఆర్ధిక సాయంలో 90 శాతం గ్రాంటుల్లాంటి ప్రయోజనాలు కల్పించని అంశాలను పొందుపరిచారు. ప్రత్యేక హోదా ఉంటే కేంద్రం నుంచి 90 శాంత గ్రాంటు లభిస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి అందే రుణాల్లో 90 శాతం గ్రాంటుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా లేకపోతే కేంద్రం ఇచ్చే గ్రాంటు 60 శాతమే. విదేశీ రుణాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వలన రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని నివేదికలో పొందుపరిచారని తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 15 శాతం అదనపు తరుగుబడి రాయితీ, 15 శాతం అదనపు పెట్టుబడి రాయితీ వల్ల తక్షణ ప్రయోజనం ఉండదన్న విషయాన్ని నివేదికలో చేర్చారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలు లాభాలబాట పట్టినప్పుడు మాత్రమే ఈ రెండు రాయితీలతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
రెవిన్యూ లోటు భర్తీకి కేంద్రం ఇస్తున్న గ్రాంటు కూడా ఏటేటా తగ్గిపోతోంది. మొదటి సంవత్సరం 6,600 కోట్ల రూపాయలుగా ఉన్న ఈ గ్రాంటు రెండో సంవత్సనం 4,600 కోట్లకు తగ్గిన విషయాన్ని నివేదికలో విశదీకరించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం కల్పించిన ఆర్ధిక వెసులుబాటు రెండేళ్లలో 7 వేల కోట్ల రూపాయాలకు మించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.