తెదేపాకి మిత్రపక్షంలో శత్రువు వంటి సోము వీర్రాజు మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న అనకాపల్లికి వచ్చినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “అమరావతి నిర్మాణం చాలా అవారమే. అందుకే దాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ.3,000 కోట్లు ఇచ్చింది. కానీ ఇంతవరకు అక్కడ ఒక్క పని మొదలుపెట్టలేదు. పైగా అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు, ఐదు లక్షల కోట్లు కావాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. అసలు అనకాపల్లి మునిసిపల్ ఆఫీస్ భవనానికి అమరావతిలో భవనానికి తేడా ఏముంటుంది. దేని నిర్మాణానానికయినా అంతే ఖర్చవుతుంది కదా? మరి అటువంటప్పుడు అమరావతి నిర్మాణం కోసం అన్ని లక్షల కోట్లు ఎందుకు అవసరం? గుజరాత్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలు 15-20 వేల కోట్లతోనే అద్భుతమైన రాజధానులు నిర్మించుకోగలిగినప్పుడు, అమరావతికి లక్షల కోట్లు దేనికి? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు అడిగితే అంతా ఇవ్వడం సాధ్యం కాదు. చేతిలో ఉన్న డబ్బుతో ముందు పనులు మొదలుపెడితే బాగుంటుంది,” అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన కేంద్రం మనసులో మాటనే చెప్పారని భావించవచ్చు. కనుక అమరావతి కోసం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఇంకా డబ్బు అడిగి భంగపడేబదులు, కేంద్రం సూచిస్తున్న విధంగా చేతిలో ఉన్న ఆదాయాన్ని బట్టే అమరావతిని నిర్మించుకోవడం అన్నివిధాల మేలు. లేకుంటే అమరావతి ఎప్పటికీ కాగితాల మీద చిత్రాలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ప్రత్యేక హోదా విషయంలో కూడా భాజపా ఇదివరకులాగ ఇప్పుడు దాగుడు మూతలు ఆడకుండా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెపుతోంది. సోము వీర్రాజు హోదా గురించి కూడా చాలా స్పష్టంగానే మాట్లాడారు. “ప్రత్యేక హోదా అంశాన్ని జగన్, వామపక్షాలు, కొందరు నేతలు ఒక సెంటిమెంటుగా మార్చివేసి, దానిని ప్రజల మనసులలోకి బలవంతంగా చొప్పించి, ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చేస్తున్న ఆ పని వలన రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ఆ హోదా పొందిన ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగానే నిధులు, ప్రాజెక్టులు కేంద్రం మంజూరు చేస్తోంది. ఆ హోదా పొందిన 11 రాష్ట్రాలకు గడిచిన మూడేళ్ళలో ఒక్కో దానికీ ఏడాదికి రూ. 7 వేల కోట్లు చొప్పున కేవలం రూ 21 వేల కోట్లు మాత్రామే మంజూరు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా లేకపోయినా ఈ రెండేళ్ళలోనే కేంద్ర ప్రభుత్వం రూ.1.42 లక్షల కోట్లు కేటాయించింది. కనుక హోదా కోసం ప్రాకులాడటం కంటే, రాష్ట్రాభివృద్ధికి ప్రాజెక్టులు వాటికి అవసరమైన తగినన్ని నిధులు విడుదల అవుతున్నాయా లేదా అని చూసుకొంటే సరిపోతుంది,” అని అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కొంచెం ఆలశ్యంగా అయినా ఎట్టకేలకు ధైర్యం చేసి ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. కనుక తెదేపా కూడా దీనిపై ఇంకా ఎక్కువ కాలం నాన్చకుండా తన వైఖరిని తేల్చి చెప్పడం దానికే మంచిది. లేకుంటే భాజపా సేఫ్ అయిపోతుంది తెదేపా నష్టపోవలసి రావచ్చు.