భారత జాతీయ దర్యాప్తు సంస్థ అభ్యర్ధన మేరకు జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అరెస్ట్ కోసం ఇంటర్ పోల్ నిన్న రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. వారిలో మసూద్ అజహర్ పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడులకు కుత్రపన్నాడు. అతను ప్రస్తుతం పాకిస్తాన్ రక్షణలోనే ఉన్నాడని అందిరికీ తెలుసు కానీ పాక్ ప్రభుత్వం అతనిని భారత్ కి అప్పగించేందుకు సిద్ధంగా లేదు కనుక అతనిని అరెస్ట్ చేయడం కోసం ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించింది. అయితే వారిరువురిపై ఇదివరకే చెరో రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయ్యింది. వారిలో మసూద్ అజహర్ పార్లమెంటు, జమ్మూ కాశ్మీర్ శాసనసభపై దాడులకు కుట్రలు పన్నినందుకు, అతను తమ్ముడు అబ్దుల్ రవూఫ్ 1999లో IC-814 నెంబరుగల విమానాన్ని హైజాక్ చేసినందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యేయి. కానీ ఇప్పటికీ వారు పట్టుబడలేదు. కనుక తాజాగా జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
పఠాన్ కోట్ దాడులకు కుట్రలు పన్నినవారిని పట్టుకొని శిక్షించాలనే పట్టుదల, ఆసక్తి ప్రస్తుతం భారత్ ప్రభుత్వంలో కూడా కనిపించడం లేదు కనుక పాకిస్తాన్ కూడా ఆ కేసుపై దర్యప్తును మెల్లగా అటక ఎక్కించేసినట్లే కనబడుతోంది. మళ్ళీ అటువంటి సంఘటన ఏదో జరిగినప్పుడు రెండు ప్రభుత్వాలు హడావుడి చేస్తాయేమో? ప్రభుత్వాలలో కనిపిస్తున్నా ఈ నిర్లిప్తతే ఉగ్రవాదులను కూడా మళ్ళీ మళ్ళీ దాడులు చేసేందుకు ధైర్యం కల్పిస్తున్నట్లుంది.