తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత నిన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోవచ్చని సర్వేలన్నీ సూచిస్తున్నాయి. అదే జరిగితే ఆమెకు మళ్ళీ పాత కష్టాలు మొదలవవచ్చు. కరుణానిధి అధికారంలోకి వస్తే మొట్ట మొదట ఆయన ప్రభుత్వం చేసే పని ఏమిటంటే, జయలలిత, ఆమె పార్టీ నేతలపై ఏవో ఒక కేసులు పెట్టడం వేధించడం మొదలుపెట్టడం తధ్యం. జయలలిత అధికారంలోకి వచ్చినప్పుడు అలాగే వ్యవహరించారు కనుక ‘టిట్ ఫర్ టాట్’ తప్పదు. ఆమె పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని ప్రధాని మోడీ స్వయంగా ప్రయత్నిస్తే ఆమె తిరస్కరించింది. ఆమె కాదనడంతో డిఎండికె అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ గుమ్మం ముందు భాజపా నిలబడవలసి వచ్చింది. కానీ ఆయన కూడా భాజపాని చాలా చులకనగా చూసారు. కనుక తమిళనాడు ఎన్నికలలో భాజపా ఒంటరిగా పోటీ చేయవలసి వచ్చింది. సర్వే ఫలితాల ప్రకారం భాజపాకి 4 సీట్లు దక్కితే చాలా గొప్ప విషయమే. తమిళనాడులో భాజపాకి ఇటువంటి అవమానకర పరిస్థితి కలగడానికి కారణం దానితో పొత్తులు పెట్టుకోవడానికి జయలలిత తిరస్కరించడమే. కనుక ఒకవేళ ఆమె ఎన్నికలలో ఓడిపోతే, ఆమెపై సుప్రీం కోర్టులో ఉన్న అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయిస్తే ఆమెకు ఇంకా ఇబ్బందే. తమిళనాడులో భాజపా నిలద్రొక్కుకోవాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ అండదండలు చాలా అవసరం కనుక, జయలలితతో మోడీ చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ఆ కేసు నుంచి బయటపడేందుకు ఆమె కూడా అందుకు సిద్దం అయినా అవవచ్చు.