`ఏమిటో పిచ్చిగాలులుతప్ప పిసరంత వానలు పడటంలేదు. ఆమధ్య,వానలుపడ్డాయికదా అని మెట్టసాగు మొదలుపెడితే, ఇప్పుడేమో,వానలువెనకబడటంతో పంటలు ఎండిపోతున్నాయి’ ఉర్లోని బక్క రైతు వెంకన్న దిగులుపడిపోతున్నాడు.
అప్పుడే అటుగా వెళుతున్న బ్రహ్మానందం రైతుకళ్లలో దిగులు గమనించి సైకిల్ దిగి …
`ఏమిటోయ్ వెంకన్నా, దిగులుగాఉన్నావ్?’
`దండాలండీ పంతులుగారూ, వానలు పడటంలేదండీ, పంట ఎండిపోతోంది. గుండెలు తరుక్కుపోతున్నాయి’ ఆవేదన బయటపెట్టాడు వెంకన్న.
`పడవు, వానలు పడవు. ఎలా పడతాయిరా. ఇందాకే తెలుగు రాష్ట్రాల జాతకాలు చూశాను. లెక్కలుకట్టాను. ఈ జాతక బ్రహ్మి చెప్పింది జరిగితీరుతుంది’
`అయ్యో, తమరు పండితులోరూ, మీరే అట్టఅంటేఎలా, ఈఏడాది పంటమీదనే ఆశలన్నీ, అప్పుతీరకపోతే బజార్నపడాల్సిందే’ ఏడుపు తన్నుకొస్తోంది వెంకన్నకు.
`ఇది శాపంగాదురా సన్నాసి వెధవ. అక్కడ గ్రహాలు తిరగబడుతున్నాయి. అందుకే దక్షిణాదిన కురవాల్సిన వానలు ఉత్తరాదిన తెగపడుతున్నాయి. అక్కడ వరదలు, ఇక్కడేమో వానలు నిల్లూ… పోతాంరోయ్, పిడికెడు అన్నంలేక పోతాం ‘
`తప్పండీ, మీరు పెద్దోళ్లూ, ఇలా శాపనార్ధాలు పెట్టకూడదు. అవునుసామీ, మీరేగదా, మొన్న ఉగాది పంచాంగంరోజున వానలు బాగా పడతాయన్నది. ఇంతలో ఏటొచ్చింది ఈ గ్రహాలకు ‘
`అప్పుడు గ్రహాలు సానుకూలంగానే కనబడ్డాయి. అదేంటో ఈ మధ్యనే రెండు గ్రహాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది ‘
`అవేం గ్రహాలు సామీ, చక్కగా పశువులుతినే పచ్చిగడ్డిని భగ్గుమనిపిస్తున్నాయి ‘
`నీ మొహం మండా, పచ్చగడ్డి అంటే నిజంగా పచ్చగడ్డికాదు. ఆ రెండు గ్రహాలకు పడిచావడంలేదవు అర్థం. అదన్నమాట… ‘
`అర్థమైంది సామీ, ఇంతకీ ఆ రెండు గ్రహాలు ఏమిటి ? ‘
`ఓరి నీ డౌట్ డెటాల్ లో పెట్టి కడగా, ఇద్దరూ చంద్రుల్లేరా నాయనా. ఉపగ్రహాల్లా ఉన్నా అసలు గ్రహాలమాట కూడా వినడంలేదురా అబ్బీ. అందుకే ఇలా తగలడింది ‘
`అదేంటీ సామీ, మీరు నన్ను అమయాకుడ్నిచేసి ఆడిస్తున్నారు. నాకు తెల్వదాఏంటీ, మనకున్నది ఒకటే చంద్రుడుగందా…ఇప్పుడు రెండో చంద్రుడెక్కడి నుంచి వచ్చాడంట? ‘ లాజికల్ పాయింట్ లాగాడు వెంకన్న.
`ఓర్నీ, నీతెలివి తీసుకెళ్లి తంగేడుచెట్టుకిందపెట్టా… లెక్క బాగానే పట్టేశావ్. చూడు, ఒక చంద్రుడు నీకెట్టాగో తెలిసిఏడ్చింది. రెండో చంద్రుడెవన్నదే నీ డౌట్. మరి బృహస్పతి తెలుసురా నీకు ‘
`అంటే గురువు కదా సామీ ‘
`ఓరి నీ జర్నల్ నాలెడ్జ్ మీద జిల్లేడుపాలుపొయ్యా, బాగానే పట్టేశావ్. ఒరే, ఇంత పెద్ద విషయం ఎలా తెలిసిందిరా నీకు… ఆ రహస్యమేమిటో ఈ చెవికి చెప్పరా…’
`ఇది పెద్దో చిన్నో నాకు తెలియదు సామీ, మీరేగదా, మొన్నీమధ్య గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పేసినారు. గోదావరినీళ్లలోకి గురువు వచ్చేస్తున్నాడని. ఆడ్నే అదేదో బురహసపతి అంటారని. అలాగ గుర్తెట్టేసుకున్నా ‘
`భేష్ రా, బాగానే పట్టేశావ్’
`సామీ, ఇంతకీ గురువు సంగతి ఎందుకు అడిగేశారు ? ‘
`ఆఁ అదేరా, గురువు గ్రహానికి మన భూమికి చంద్రుడులాగానే ఓ నాలుగు పెద్ద ఉపగ్రహాలు ఏడ్చాయి. ఇందులో ఒక చంద్రుడు మనకేసే అంటే మనభూమికున్న చంద్రుడివైపు తెగచూస్తున్నాడు ‘
`ఎందుకట్టా సామీ ‘
`ఎందుకంటే ఏం చెబుతాంరా, మన ప్రారబ్దం. అంటే కర్మ. మొదటి నుంచీ ఒక చంద్రుడికే రాజయోగం పట్టిందనుకుంటే, మొన్నీమధ్యనే మరో చంద్రుడికి అదే యోగం పట్టింది. దీంతో ఈ ఇద్దరు చంద్రులు ఎదురెదురుగా నిలబడి తిట్టుకుంటున్నార్రా… ‘
`వాళ్లిద్దరూ తిట్టుకుంటే మనకేం సామీ? ‘
`ఓరి నీతెలివి తెల్లావుదగ్గరకెళ్ళా, కేవలం తిట్లతో సరిపెట్టుకోవడంలేదురా, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. వారి మాటలువీరు, వీరి మాటలు వారు రికార్డ్ చేసేసుకుని నీదే తప్పంటే, నీదే తప్పని వాదులులాడుకుంటున్నారు ‘
`వీరికి ఇదేం పాడుబుద్ది. ఎవరిపని వారుచేసుకోక ‘
`మరి అదే, ఎవరి డ్యూటీ వాళ్లు మరచిపోయి, ఎదుటివాడి డ్యూటీలో తప్పులు వెతుకుతున్నారు ‘
`అవును సామీ, నాకో డౌట్. ఇంతకీ మనకు వానలు పడకపోవడానికీ, ఆ ఇద్దరు చంద్రులు కొట్టుకుచావడానికీ ఏంటీ సంబంధం? ‘
`మరి అదే లాజిక్. ఈ గ్రహాలకూ డ్యూటీ ఛార్ట్ వేసేది బృహస్పతివారు. ఆయన దేవతలకే గురువు. ఈ ఇద్దరు చంద్రులు కొట్టుకుచస్తుంటే, వీరి సమస్య పరిష్కరించే పనిలోపడ్డ గురువు తన డ్యూటీ మరచిపోయారు. దీంతో వానదేవుడి వర్క్ షెడ్యూల్ లో తేడాలొచ్చేశాయట. అక్కడ కొట్టింది దెబ్బ. వానదేవుడు ఉత్తరాదినే తిష్టవేసుకుని కూర్చుని కదలనంటున్నాడు. పట్టించుకునే వాడేలేడాయె’ చాలా తెలివిగా చెప్పాననుకుని బ్రహ్మానందం తన భుజాన్ని తానే చరచుకుంటూ అభినందించుకున్నాడు.
`ఏమిటో సామీ, నాకు ఒక్క ముక్క అర్థంకాలేదు’
`అర్థంకాదురా, ఇదంతా శాస్త్రం. గ్రహశాస్త్రం. ఏళ్లతరబడి చదువుకున్ననాకే అర్థంకావడంలేదు. బడుద్దాయివి నీకెలా అర్థమవుతుందిరా… ఒక్కమాట చెబుతున్నా విను, ఇద్దరు చంద్రులకు మధ్య సఖ్యత కుదిరితేనేగానీ వానలు పడవురా అబ్బీ ‘
`ఓహో,మరి అదెలా సాధ్యమవుతుందంటారు సామీ ‘
`ఒక్కటే దారి, నరసింహ అనే పేరుగలవ్యక్తి ఎవడో మహాశక్తిసంపన్నుడు ఈ ఇద్దరికీ తాయిత్తులూగట్రా కట్టేసి వార్ని దారికి తీసుకురావాల్సిందే. అదిగో, అలాంటి వ్యక్తికోసమే వెతుకుతూ బయలుదేరాన్రా.. దొరకగానే హోమాలు చేయిస్తా, యజ్ఞాలు చేయిస్తా, వానలు కురిపిస్తా. అందుకు నీవంతు సాయం చేయరా వెంకన్నా, ఒ వెయ్యి రూపాయలు ఇచ్చుకో…’
`అలా చేస్తే వానలు పడతాయా సామీ. అయితే అంత ఇచ్చుకోలేను. ఇదిగో ఈ ఐదువందలు ఉంచుకోండి. వెళ్ళి ఆ నరసింహుడ్ని పట్టుకుని గట్టిగా పూజచేయించండి. మన తెలుగునాట వానలు పడేలా చేయండి సామీ, ఆకలితో మాడకుండా చూడండిసామీ ‘
వెంకన్న ఇచ్చిన డబ్బు బొడ్లో దోపుకున్నాడు బ్రహ్మానందం. ఇలాంటి మాటలు నమ్మె పిచ్చిగాలిగాళ్లు ఉన్నంతవరకు తనకేం ఫర్వాలేదనుకుంటూ, బ్రహ్మానందం పరమానందపడుతూ మళ్ళీసైకిలెక్కి మరో కేసు పట్టుకోవడం కోసం బయలుదేరాడు. పిచ్చిగాలి దంచికొడుతోంది.
– కణ్వస