ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రధాన కార్యదర్శి టక్కర్ సి.ఎస్. టక్కర్ తదితరులను వెంటబెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్ర సమస్యలు, కేంద్రం హామీలు, నిధుల కొరత, కరువు పరిస్థితులు వగైరా విషయాల గురించి మరొక్కసారి మనవి చేసుకొన్నారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన దానిని బట్టి ముఖ్యమంత్రి చెప్పినదంతా ప్రధాని మోడీ చాలా శ్రద్దగా విన్నారు కానీ ఎటువంటి నిర్దిష్టమైన హామీలు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. కరువు పరిస్థితులపై ప్రధాని సమావేశం జరపడమే చాలా స్పూర్తిదాయకం అని చంద్రబాబు చెప్పారు. అయితే మీడియా ఆశిస్తున్నది ఇది కాదు..మంచి మసాలా కోసం ఎదురుచూస్తున్నట్లుందని ఆయన నవ్వుతూ అన్నారు.ప్రధానితో సమావేశం చాలా సంతృప్తికరంగా ముగిసిందని అన్నారు. ఏపికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఆ తరువాత వారందరూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి మళ్ళీ అదే పాట వల్లెవేశారు. ఆయనైనా వారికి ఏమైనా హామీ ఇచ్చారో లేదో ఇంకా తెలియవలసి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ నుండి ఎటువంటి హామీ ఇవ్వనప్పుడు, జైట్లీ మాత్రం ఇస్తారనుకోలేము. చంద్రబాబు నాయుడు మాట కొట్టేయలేక ఏదో ఒక పద్దు క్రింద కొంత విదిలిస్తారేమో? అదే జరిగితే చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళారు వట్టి చేతులతో తిరిగి వచ్చేరని విమర్శలు మూటగట్టుకోక తప్పదు.