ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరించబడిన అమర్ సింగ్, తొమ్మిదేళ్ళ క్రితం పార్టీని వీడిన బేణీ ప్రసాద్ వర్మ ఇద్దరు మళ్ళీ స్వంతః గూటికి చేరుకొన్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉన్నందున, అధికార సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇప్పటి నుంచే పార్టీని మళ్ళీ శక్తివంతంగా తయారుచేసుకొనే పనిలో పడ్డారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే వారిద్దరినీ మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించి, రాజ్యసభ సీట్లు కూడా కేటాయించేసారు.
అమర్ సింగ్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే మరో పేరు జయప్రద. బహుశః ఆమె కూడా నేడోరేపో మళ్ళీ సమాజ్ వాదీ పార్టీలోకి ప్రవేశించవచ్చు. ఆమె ఇదివరకు పార్టీలో ఉన్నప్పుడు రాంపూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆమెకు తన స్వంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ అభిమానులు, ప్రజాధారణ కలిగి ఉన్నారు. కనుక ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం ఖాయమే.
ఆమె సమాజ్ వాదీ నుంచి బయటకు వచ్చిన తరువాత తన స్వస్థలమైన రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేయాలనుకొన్నారు. తనకు ఎ పార్టీ అక్కడి నుండి పోటీ చేయడానికి సీటు ఇస్తే ఆ పార్టీలో చేరడానికి ఆమె సిద్దం అయ్యారు. కానీ ఆమె షరతుకి ఏ పార్టీ కూడా అంగీకరించకపోవడంతో, ఆంధ్రా రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించాలనే ఆమె కోరిక నెరవేరలేదు, మళ్ళీ ఉత్తర ప్రదేశ్ కే తిరిగి వెళ్లిపోవలసి వచ్చింది. ఇదివరకు మంత్రి ఆజం ఖాన్ కారణంగా అమర్ సింగ్, జయప్రద పార్టీ నుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. కానీ ఈసారి సమాజ్ వాదీ పార్టీకి వారి అవసరం చాలా ఉంది కనుక ఆజం ఖాన్ ని ములాయం సింగ్ అదుపు చేయవచ్చు.