హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై ఇవాళ లోక్‌సభలో స్పందించారు. హైదరాబాద్‌వంటి నగరాన్ని కోల్పోవటం ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద లోటే అని మంత్రి అంగీకరించారు. ఏపీ లోటు బడ్జెట్ పూడ్చటానికి, రాజధాని నిర్మాణానికి, పరిశ్రమల స్థాపనకు కేంద్రం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. విభజనవల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని అంగీకరించారు. రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని, మొదటి ఏడాది వీలైనంత సాయం అందించామని చెప్పారు. అభివృద్ధి అంశంలో ఏపీ తమకు ప్రధానమైనదని స్పష్టం చేశారు. విభజనవల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని ఎంపీలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఏపీని ఆర్థిక నష్టాలు అధిగమించేలా సహకరించటం తమ ఎజెండాలో ఉందని చెప్పారు. అభివృద్ధి రేటు 9కి చేరితే అన్ని రాష్ట్రాలకూ అభివృద్ధి ఫలాలు అందుతాయంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని చెప్పారు. అయినాకూడా దీనిపై నీతి ఆయోగ్(ప్రణాళికా సంఘం), ముఖ్యమంత్రుల సబ్ కమిటీ చర్చిస్తోందంటూ అసలు విషయం చెప్పకుండా దాటవేశారు.