నందమూరి బాలకృష్ణ సెంచరీ సినిమా.. గౌతమి పుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం మొరాకోలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈనెల 20న చిత్రబృందం ఇండియా తిరిగొస్తుంది. జూన్ 1 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. గౌతమి పుత్ర… చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. రాజుల కోటలు, సింహద్వారాలు, రాజ దర్బార్లూ.. ఇలాంటి హంగులన్నీ చూపించాలి. వాటి కోసం ఏ ఫిల్మ్సిటీలోనో సెట్లు వేయొచ్చు. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి కోసం చిత్రబృందం కొత్తగా ఆలోచించింది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం ఏకంగా పదెకరాల భూమి కొనేసింది. చుట్టూ ప్రహారీ నిర్మించి అక్కడ భారీ సెట్లు వేయాలనుకొంటోంది.
ఎవరైనా షూటింగ్ కోసం స్థలం అద్దెకు తీసుకొంటారు. కానీ.. క్రిష్ మాత్రం స్థలం కొనేశాడట. భవిష్యత్తులో ఆ సెట్లు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో క్రిష్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సెట్స్ వేసే పనిలో ఉంది ఆర్ట్ విభాగం. దాదాపు 70 శాతం షూటింగ్ ఆ సెట్స్‌లోనే జరగబోతోందని టాక్. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. నయనతార కన్ఫామ్ అయినా.. ఆమె డేట్ల వ్యవహారం కాస్త కన్ఫ్యూజన్లో ఉంది. కథానాయిక ఎవరైనా సరే.. ఈ సినిమాని 2017 సంక్రాంతి బరిలో దింపడం ఖాయమని చిత్రబృందం చెబుతోంది.