అరవై ఏళ్ల వయసు దాటిన వారిని కృష్ణా రామా అనుకుంటూ ఓ మూలన కూర్చోరాదా అంటుంటారు. అయితే రాజకీయాల్లో మాత్రం అది చిన్న వయసు. ఓ స్థాయి పదవి రావాలంటే 60 దాటిన తర్వాతే. చాలా మంది విషయంలో అదే జరిగింది. అయితే 90 ఏళ్లు దాటినా ముఖ్యమంత్రి కావడం చాలా అరుదు. అదీ ఒకేసారి రెండు రాష్ట్రాల్లో, అదికూడా దక్షణాదిన కనిపించబోయే అరుదైన దృశ్యం.
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే తమిళనాడులో సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించే సూర్యడి గుర్తున్న డీఎంకే అధికారంలోకి వస్తుంది. ఆ పార్టీ అధినేత కరుణానిధి ముఖ్యమంత్రి అవుతారు. ప్రస్తుతం ఆయన వయసు 91 ఏళ్లు.
తమిళనాడుకు పొరుగు రాష్ట్రం కేరళలోనూ 90 ప్లస్ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ ముఖ్యమంత్రి కావచ్చని అంటున్నారు. అక్కడ ఎర్రజెండా రెపరెపలాడుతుందని , అధికార కాంగ్రెస్ ఓడిపోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 92 ఏళ్ల అచ్యుతానందన్ కరుణానిధి కంటే పెద్ద వారు.
తమిళనాడులో కరుణానిధి కొడుకు స్టాలిన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కొందరు డీఎంకే నాయకులు భావించారు. కానీ కరుణానిధి ఒప్పుకోలేదు. తాను బతికున్నంత వరకూ అలా జరగదని చెప్పారు. తనకు ఏదైనా అయితేనే స్టాలిన్ కు అవకాశమని తేల్చి చెప్పారు. అయితే, పేరుకు కరుణానిధి సీఎం అయినా ఆయన లేచి నడవలేరు. చక్రాల కుర్చీ దిగలేరు. కాబట్టి పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా చక్రం తిప్పేది స్టాలినే.
ద్రవిడ రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరు పొందిన వారిలో కరుణానిధి ఒకరు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. సవాళ్లను ఎదుర్కొన్నారు. అన్నాడీఎంకే నేత ఎంజీఆర్ తో రాజకీయంగా ఢీ అంటే ఢీ అనే వారు. కరుణానిధికి ఓ అరుదైన రికార్డు కూడా ఉంది. ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఆరుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. 1962లో ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తొలి, మలి విడతల్లో ఆయన స్వల్ప కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాతి కాలంలో పూర్తి
టర్మ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కేరళలో అత్యంత సీనియర్ నాయకుడైన అచ్యుతానందన్ ఇదివరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర సీపీఎం నేతలతో విభేదాల కారణంగా ఇబ్బందులు పడ్డారు. అయినా పార్టీకే కట్టుబడి ఉన్నారు. 1962 చైనా యుద్ధ సమయంలో ఆయన భారత్ ను సమర్థించారు. యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికుల కోసం ఆయన రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అప్పటి సీపీఎం బడానేతలు కొందరికి ఇది నచ్చలేదు. దీంతో పార్టీలో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించారు.
ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అనేదాన్ని బట్టే ఈ 90 ప్లస్ నేతలు ముఖ్యమంత్రులు అవుతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. కేరళలో సీపీఎం గెలిచినా, ముఖ్యమంత్రిగా పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనేది కూడా ఆసక్తికరం.