ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలను కలిసిన తరువాత వారి నుంచి ప్రత్యేక హోదా, నిధుల విడుదల కోసం ఎటువంటి హామీ, ప్రకటన రాలేదు. వారు హామీ ఇచ్చినట్లు చంద్రబాబు కూడా గట్టిగా చెప్పుకోలేకపోయారు. ‘వారితో సమావేశం సంతృప్తికరంగా జరిగింది’ అనే పడికట్టు డైలాగ్ ఒకటి మీడియా ముందు వల్లించేరు. కేంద్రం సహాయం కోసం ఎదురు చూడకుండా తన పని తాను చేసుకుపోతానని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. అంటే ఈసారి కేంద్రం రూపాయి కూడా విదిలించదని స్పష్టం అయ్యింది. కనుక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అప్పుడే ఆయనపై విమర్శలు మొదలుపెట్టేశాయి.
వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ప్రజల, ప్రతిపక్షాల పోరు భరించలేకనే డిల్లీ వెళ్ళారు తప్ప ఏదో సాధించుకొని వద్దామని కాదు. ఆయనకి ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా నిలదీసి అడిగే ధైర్యం లేదు. నిన్నటి డిల్లీ పర్యటనతో ప్రత్యేక హోదాపై మోడీని గట్టిగా నిలదీయలేరని మళ్ళీ మరోమారు నిరూపించుకొన్నారు. కనుక ఆయన ఇంకా ఎన్నిసార్లు డిల్లీ వెళ్లి వచ్చినా ప్రయోజనం లేదు. ఉండబోదు కూడా,” అని విమర్శించారు.
కాంగ్రెస్, వామపక్షాల నేతలు కూడా చంద్రబాబు నాయుడుపై మరిన్ని విమర్శలు గుప్పించవచ్చు. వారి విమర్శల సంగతి ఎలాగ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఇంక డిల్లీ వెళ్ళడం అనవసరమని నిన్న స్పష్టమయింది. ఆయన మాటకి డిల్లీ పెద్దలు విలువ ఈయనప్పుడు, మళ్ళీ మళ్ళీ డిల్లీ వెళ్లి వారిని కలుస్తుండటం వలన వారి దృష్టిలో ఆయన ఇంకా చులకనవుతుంటారు. అది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లే అవుతుంది. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మళ్ళీ ఇప్పుడు అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. కనుక చంద్రబాబు నాయుడు ఇంక మళ్ళీ ఎప్పుడూ డిల్లీ వెళ్ళే ఆలోచన చేయకుండా, తను చెప్పుకొన్నట్లుగా తన స్వశక్తితోనే రాష్ట్రాభివృద్ధికి గట్టిగా ప్రయత్నాలు చేసుకుపోతే వచ్చే ఎన్నికలలో ఎవరికీ ఏవిధంగా గుణపాఠం చెప్పాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకొంటారు.