రచయితగా ఎన్ని సినిమాలు చేసినా సంపాదించలేనిది… దర్శకుడిగా మారి ఒక్క హిట్టుకొడితే చాలు, బ్యాంకు బ్యాలెన్సులు పెంచేసుకోవొచ్చు. అంతకు ముందు కొరటాల శివ అంటే ఎంత మందికి తెలుసు. మిర్చి సినిమాతో పాపులర్ అయిపోయాడు. శ్రీమంతుడుతో ఎక్కడికో ఎదిగిపోయాడు. ఇప్పుడు జనతా గ్యారేజీ అంటూ ఎన్టీఆర్తో జట్టు కట్టాడు. ఈ సినిమా కోసం కొరటాల అందుకొంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ సినిమాకి కొరటాల ఏకంగా 10 కోట్లు తీసుకొన్నాడన్న వార్తలొచ్చాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల అందుకొన్న లెక్క తేలింది.
ఈసినిమాకోసం కొరటాల దాదాపు రూ.8 కోట్ల రొక్కం అందుకొన్నాడట. అక్కడితో ఆగలేదు. ఈ సినిమా సాధించిన వాటాలో 50 శాతం షేర్ తనకు ఇవ్వాలని షరతు పెట్టాడట. దాంతో నిర్మాతలు కూడా ఓకే అన్నారు. శ్రీమంతుడు రూ.150 కోట్లు సాధించడంతో కొరటాలపై నిర్మాతలకు నమ్మకం కుదిరింది. అంతా బాగుండి ఈ సినిమా కనీసం రూ.20 కోట్లు లాభాలు తెచ్చుకొంటే.. అందులో కొరటాల వాటా రూ.10కోట్లు. అంటే పారితోషికంగా కొరటాల మొత్తం అందుకోబోతున్నది రూ.18 కోట్లన్నమాట. రాజమౌళి తరవాత ఆ స్థాయిలో పారితోషికం అందుకొనేది ఈయనే! సినిమా పోయినా.. రూ.8 కోట్లు నికరంగా అందుకొన్న మెత్తం ఉండనే ఉంది. కాబట్టి ఈ సినిమా ఎంత ఆడితే.. కొరటాలకు అంత బోనస్ అన్నమాట. జాక్ పాట్ అంటే ఇదే!