తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో చేస్తున్న దీక్షతోనే ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాల మధ్య మళ్ళీ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తాజాగా రాజోలిబండ (ఆర్.డి.ఎస్.) నీళ్ళ మళ్లింపు వ్యవహారంతో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారాయి. కర్నాటక నుంచి ఆర్.డి.ఎస్.కి నీళ్ళు తరలించే కాలువలలో పూడిక పేరుకుపోవడంతో తెలంగాణాకి రావలసిన 15.9 టి.ఎం.సి.ల నీళ్ళకి బదులు 4 టి.ఎం.సి.ల నీళ్ళు మాత్రమే చేరుతున్నాయి. కాలువల పూడికతీసివేసి, ఆధునీకరించేందుకు తెలంగాణా ప్రభుత్వం కర్నాటకకి రూ. 70కోట్లు చెల్లించింది. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేరు కానీ ఆర్.డి.ఎస్. ఆనకట్ట ఎత్తుని పెంచడానికి ప్రయత్నించడంతో, ఆనకట్టకి మరోవైపున్న కర్నూలు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని వలన తమ జిల్లాకి రావలసిన నీళ్ళు రావని, వాటిని కూడా తెలంగాణా రాష్ట్రానికే మళ్ళించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఆర్.డి.ఎస్. ఆధునీకరణ పనులను తక్షణమే నిలిపివేయాలని లేకుంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కర్నూలు జిల్లా కలక్టర్, రాయచూరు జిల్లా కలెక్టర్ కి ఒక లేఖ వ్రాయడంతో పనులు నిలిచిపోయాయి.
అందుకు తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చర్చించుకోవడానికి వెంటనే రావాలని ఆంధ్రా నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఫోన్ చేసి కోరారు. కానీ కర్నూలు రైతులకు నష్టం కలిగించే ఆ ప్రాజెక్టుపై మంత్రు చర్చించుకోవడం కంటే, ముందుగా ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు చర్చించుకొంటే మంచిదని సూచించారు. ఈ విషయంలో ఏపి ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే, ఇకపై తెలంగాణా ప్రభుత్వం కూడా ఏపికి సహకరించదని హరీష్ రావు హెచ్చరించడమే కాకుండా నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకి నీటిని విడుదల చేయకుండా నిలిపివేసింది. ఏపి ప్రభుత్వం పిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డు జోక్యం చేసుకొని ఆదేశాలు జారీ చేయడంతో మళ్ళీ నిన్న సాయంత్రం సాగర్ నుంచి నీటిని విడుదల చేసింది. ఇది పరిస్థితుల తీవ్రతకి అద్దం పడుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి కృష్ణా రివర్ బోర్డుకి పిర్యాదులు చేసుకొన్నాయి. వాటి పిర్యాదులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవలసి ఉంది.