రాష్ట్ర విభజన ఉద్యమం మొదలయినప్పటి నుంచి నేటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏదయినా ఒక సమస్య తలెత్తితే దానిపై మాట్లాడేందుకు ఏదో ఒక పార్టీ ఇబ్బందిపడవలసి వస్తోంది. ఉదాహరణకి రాష్ట్ర విభజన గురించి తెరాస గట్టిగా పోరాడుతున్నప్పుడు తెదేపా నేతలు దానిలో పాల్గొనడానికి ఇబ్బందిపడ్డారు. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి ఏపిలో మళ్ళీ వేడి పెరిగినపుడల్లా భాజపా నేతలు మీడియాకి కనబడకుండా తప్పించుకొని తిరుగుతుంటారు.
ఇప్పుడు తెలంగాణాలో వైకాపా నేతలు కూడా అటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. వారి అధినేత జగన్ స్వయంగా తమ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే ప్రజలకు, అధికార తెరాస పార్టీకి జవాబు చెప్పుకోవడం చాలా కష్టమే. కనుక వాళ్ళు కూడా కొన్ని రోజులు మౌనం వహిస్తారనుకొంటే, ఊహించనివిధంగా వాళ్ళు మంత్రి హరీష్ రావుపై ఎదురుదాడి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాష్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి ఇద్దరూ నిన్న హైదరాబాద్ లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెరాస ప్రభుత్వంపై, మంత్రి హరీష్ రావుపై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. “అసలు ఈ రెండేళ్ళలో తెలంగాణా ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టింది? వాటికి ఎన్ని నిధులు కేటాయించింది? వాటిలో ఎంత ఖర్చు చేసింది? ప్రాజెక్టుల పురోగతి ఏమిటి? అనే వివరాలు తెలుపుతూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ తెలంగాణాకు నష్టం కలుగుతుందని భావిస్తే మేమే ముందుండి ఉద్యమిస్తాము. ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే దీక్ష చేస్తున్నారు. అందులో తప్పేముంది? ఆయన అడుగుతున్న ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు నేరుగా సమాధానం చెప్పకుండా, ఆయనని తరిమికొడతామని బెదిరించడం, రాష్ట్రంలో మా పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం, మా పార్టీ జెండా దిమ్మలు పగులగొట్టడం మేము సహించము. వాటికి పాల్పడినవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు తాము రాజరిక వ్యవస్థలో ఉన్నట్లుగా, తాము నిజాం నవాబులు అన్నట్లుగా హుకుంలు జారీ చేస్తున్నారు. ఎవరూ తమని ప్రశ్నించడానికి వీలులేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. వారు తమ పద్ధతి మార్చుకోవాలి,” అని హెచ్చరించారు.