ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో, విభజన చట్టంలోని అంశాలు అమలుచేయడంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఉదాసీన, నిర్లక్ష్య, అహంకార పూరితమైన వైఖరి చంద్రబాబు నాయుడు 28 వ సారి ఢిల్లీ పర్యటనలో కూడా మంగళవారం మరోసారి దృవపడింది. అయితే సమస్యల పరిష్కారానికి చొరవతీసుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ళుగా విఫలమౌతూనే వుంది.
ఉదాహరణకు షెడ్యూలు 10లో పేర్కొనబడిన సంస్థలు సేవలను కొనసాగించే విషయంలో ఎపి, తెలంగాణ ప్రభత్వాలు విభజన జరిగిన నాటి నుంచి ఒక సంవత్సరం లోపల చర్చించుకొని ఆమోదయోగ్యంగా విధివిధానాలను రూపొందించు కోవాలని, అలా ఏకగ్రీవంగా ఒక అభిప్రాయానికి రాలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని స్పష్టంగా రాశారు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సకాలంలో తగు చర్యలు చేపట్టనందున ఉన్నత విద్యా మండలి, తెలుగు యూనివర్సిటీ, మొదలైన సంస్థల నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
అదేవిధంగా 9వ షెడ్యూల్లో ఎపియస్ఆర్టిసి, ఎపి జెన్కో, ఎపి ట్రాన్స్కో, ఎపి అగ్రోస్ వంటి రాష్ట్ర స్థాయి సంస్థల శాఖలు ఏ రాష్ట్రంలో ఉంటే అవి అలాగే కొనసాగుతాయని, హెడ్ క్వార్టర్స్ ఆస్తులను, వాటి విలువలను జనాభా నిష్పత్తి (52:48) దామాషాగా మూడు సంవత్సరాల వ్యవధి లోపల ఉభయ రాష్ట్రాలూ చర్చించుకుని అంగీకారానికి రావాలని, అలా రాలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని స్పష్టం చేశారు.
సమర్థులైన సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగించి మన రాష్ట్రానికి న్యాయంగా రావలసిన ఆస్తులను లేక అందుకు సమాన ఆర్థిక విలువను పొందేందుకు చర్యలు తీసుకోకపోవడం రాష్ట్రప్రభుత్వ వైఫల్యమే.
వ్యక్తుల పదవీ కాంక్షలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్టనిలువుగా, అసం బద్ధముగా చీల్చిన దుర్మార్గంలో అన్ని రాజకీయ పక్షాలకూ భాగస్వామ్యం ఉంది. ”సమ న్యాయం, రెండు కళ్లు” సిద్ధాంతంతో 13 జిల్లాల పునర్విభజిత నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో వైఫల్యం చెందిన వాస్తవాన్ని మరుగుపర్చి, ఇతర పార్టీలపైకి నెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని ప్రయత్నించడం ఎంతమాత్రం తగదని ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి.
అమరావతి రాజధాని, విదేశీ పెట్టుబడుల గురించే అలోచిస్తున్న ప్రభుత్వం అనేక అంశాలలో తగు రీతిలో స్పందించడం లేదు. అందువల్ల ఇప్పటికైనా చంద్రబాబునాయుడు వాస్తవంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న నిధులను జాగ్రత్తగా, పొదుపుగా, సమర్థవంతంగా వినియోగిస్తూ కోట్లాది ప్రజలకు ఉపయోగపడే పథకాలను చేపడుతూ, ప్రజలను భాగస్వాములను చేస్తూ పాలనలో అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన పరిపాలనను అందిస్తూ, తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించాలి.