వైకాపా ఎమ్మెల్యేలు తమ నియోజక అభివృద్ధి గురించే తెదేపాలో చేరుతున్నామని చెప్పుకోవడం అందరూ వినే ఉంటారు. అంటే తెదేపాలో చేరితేనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా? అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అదే నియమాన్ని తెదేపాకు వర్తింపజేసి, భాజపాలో తెదేపా విలీనం అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని మోడీ చెప్పారా? అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఇవ్వనని భాజపా అంత స్పష్టంగా చెపుతున్నా కూడా చంద్రబాబు నాయుడు భాజపాతో తెగతెంపులు చేసుకొని, తన ఇద్దరు కేంద్ర మంత్రులను వెనక్కి తీసుకొని కేంద్రాన్ని గట్టిగా నిలదీయలనుకోవడం లేదు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు తెదేపాను భాజపాలో విలీనం చేయడమో లేకపోతే దానితో తెగతెంపులు చేసుకొని జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి పోరాటానికో సిద్దం అవ్వాలని హితవు పలికారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడితే, చంద్రబాబు నాయుడు దానిని డిల్లీలో తాకట్టు పెట్టి తెలుగువారి పరువు తీశారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అయన గురించి కొడాలి నాని చాలా అనుచితంగా మాట్లాడారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చవట, దద్దమ్మ, సిగ్గుశరం లేనివాడు, తెలివి తక్కువవాడు అంటూ సంభోదించడం చాలా తప్పు. ఈ విషయంలో కొడాలి నాని తన హద్దులను దాటారని చెప్పకతప్పదు. తెలంగాణా ప్రాజెక్టుల గురించి తెగ ఆవేశపడిపోతూ ఈ మూడురోజులు మాట్లాడిన వైకాపా నేతలెవరూ కూడా అంతకు ముందు వాటి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. తమ అధినేత దాని కోసం దీక్షకు కూర్చొన్నారు కనుక ఆయనను మెప్పించడానికే అందరూ పోటాపోటీగా చంద్రబాబు నాయుడుని వింర్శిస్తున్నట్లున్నారు. కానీ తమ అధినేత మెప్పు పొందాలనే తాపత్రయంలో హద్దులు మరిచిపోయి నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రిని దూషిస్తే, మళ్ళీ రోజా కేసే పునరావృతం కావచ్చు.