ఏపి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని మూడు రోజుల క్రితమే కుండ బ్రద్దలు కొట్టినట్లు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాలలో ఉన్నప్పటికీ ఆ విషయం ఆయన చెవిన పడదనుకోలేము. అంటే హోదా, నిధుల విషయంలో సిద్దార్థ్ నాథ్ సింగ్ ద్వారా కేంద్రం తన వైఖరి స్పష్టం చేసిన తరువాత కూడా అయన డిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసివచ్చినట్లు భావించవచ్చు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి ఏమి చెప్పారో తెలియదు కానీ రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి ఆ విషయాలేవీ బయట పెట్టలేదు. ఆయన బయటపెట్టకపోయినా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేము కానీ అంతకంటే చాలా ఎక్కువే నిధులు రాష్ట్రానికి ఇస్తున్నామని సిద్దార్థ్ నాథ్ సింగ్ మళ్ళీ మరోమారు చెప్పడం విశేషం.
చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా రాష్ట్రానికి తగినన్ని నిధులు విడుదల చేయడం లేదని పిర్యాదు చేసారు. కానీ సిద్దార్థ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటి వరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీకే రూ.7,000 కోట్లు ఇచ్చాము. ఇంకా రూ.22,112 కోట్లు కేంద్రం మంజూరు చేయబోతోంది. కొన్ని సమస్యల కారణంగా హోదా అనే పేరుతోనే సహాయం చేయలేకపోయినా, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది,” అని పునరుద్ఘాటించారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ వంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న సిద్దార్థ్ నాథ్ సింగ్ చెపుతున్న ఈ మాటలు పూర్తి సాధికారకంగా చెపుతున్నవిగానే భావించవచ్చు. కేంద్రం తరపున ఆయన ఇంత స్పష్టంగా చెపుతున్నప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై ఇంకా ప్రజలతో, ప్రతిపక్షాలతో దాగుడుమూతలు ఆడటం అనవసరం. దాని వలన తెదేపాకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. భాజపా చెప్పవలసింది చెప్పేసి, ఎటువంటి పరిణామాలయినా ఎదుర్కోవడానికి సిద్ధపడింది గాబట్టి, తెదేపా కూడా ధైర్యంగా తన అశక్తతను అంగీకరిస్తే దానికే మంచిది. లేకుంటే ఈ వ్యవహారంలో భాజపా బయటపడిపోయినా తెదేపా మాత్రం ప్రజల ముందు దోషిగా నిలబడవలసి రావచ్చు.