ప్రభుత్వాలు ఏదో ఆలోచించుకొని ముందు ఒక నిర్ణయం ప్రకటించడం ఆ తరువాత ఇబ్బందులు ఎదురవగానే తన నిర్ణయాలను ఉపసంహరించుకోవడం తరచూ జరుగుతున్నదే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం హడావుడిగా సుమారు 6, 000 అశ్లీల వెబ్ సైట్లను బ్లాక్ చేయడం మళ్ళీ ఆ మర్నాడే వాటిపై నిషేధం ఎత్తివేయడమే అందుకు తాజా ఉదాహరణ. ఇంతకు ముందు ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నుంచి ప్రభుత్వ శాఖలను, ఉద్యోగులను విజయవాడకి తరలించబోతున్నట్లు ప్రకటించి, ఉద్యోగులు సహకరించకపోవడంతో తన నిర్ణయం వెనక్కితీసుకోవలసి వచ్చింది. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అదే తప్పు చేస్తోంది.
ఈసారి ప్రభుత్వ శాఖలను, ఉద్యోగులను దశలవారీగా కాకుండా ఏకంగా ఒక్కసారే విజయవాడకు తరలిస్తామని చెపుతోంది. అలాగ చేస్తే ప్రభుత్వమూ, ఉద్యోగులు కూడా మరిన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుతో చర్చలు జరిపి తమ సమస్యలు, డిమాండ్లు తెలియజేసారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కనుగొన్న పరిష్కారం ఏమిటంటే వారు వారాంతంలోనో లేకపోతే నెలకొకటి రెండుసార్లో హైదరాబాద్ వెళ్లి తమ కుటుంబాలతో గడిపి వచ్చేందుకు వీలుగా ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలు పరిమితం చేయడం.
ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చుని కూడా ప్రభుత్వమే భరించాలని ఉద్యోగులు కోరుతున్నట్లు సమాచారం. ఇక తమ హెచ్.ఆర్.ఏ.ని కూడా 30 శాతం పెంచాలని ఉద్యోగులు మరో డిమాండ్ కృష్ణారావు ముందుంచారు. ఉద్యోగుల పిల్లల చదువులు, వారి స్థానికత, ఉద్యోగులు విజయవాడలో ఉండేందుకు ఇళ్ళు, ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు కార్యాలయాలు, వంటి అనేక ముఖ్యమయిన సమస్యలను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. కానీ వీటిలో సాధ్యాసాధ్యాలు గమనించకుండా ఈసారి ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా విజయవాడకు తరలివెళ్ళాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అందుకే ఉద్యోగులు విముఖత చూపిస్తున్నారు.
ప్రభుత్వ శాఖలను, ఉద్యోగులను విజయవాడకు తరలించాలనే ఆలోచన ఏడాదిగా ఉన్నప్పుడు అప్పటి నుండే ప్రభుత్వం ఒక ప్రణాళిక, ఏర్పాట్లు చేసుకొని ఉంటే నేడు ఇటువంటి సమస్య వచ్చేదే కాదు. కానీ ఒక నిర్దిష్ట ప్రణాళిక, ఆలోచన ఏదీ లేకుండా ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, పుష్కరాల వంటి వాటి కోసం తన నిర్ణయాలను పక్కనబెడుతూ మళ్ళీ తనకి తీరిక, ఆసక్తి ఏర్పడినప్పుడు దీని గురించి ఆలోచిస్తూ అగమ్యంగా ముందుకు సాగుతోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు రాత్రికి రాత్రే ఉద్యోగులను, ప్రభుత్వ శాఖలను విజయవాడ తరలించేయాలనుకొంటోంది.
ప్రభుత్వ కార్యాలయాలు వారానికి ఆరు రోజులు పనిచేస్తుంటేనే ఫైళ్ళు ముందుకు కదలవు. ఇక వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేము. ఇక పండుగలు పబ్బాలు, శలవు దినాలు కలిసి వస్తే ఉద్యోగులు అందరూ హైదరాబాద్ బయలుదేరిపోవడం ఖాయం. అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేవరకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడక తప్పదు. ఇక అన్ని వేలమంది ఉద్యోగులు తరచూ హైదరాబాద్ వెళ్లివస్తుండానికి రవాణా సౌకర్యాలు, వాటికి అయ్యే ఖర్చు వంటి అనేక సమస్యల గురించి ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంది. వారిని ఇప్పుడు విజయవాడకు తరలించేందుకు వారానికి ఐదు రోజులు పని దినాలు పద్ధతిని అమలుచేస్తే, దానికి అలవాటు పడిన ఉద్యోగులు ఆ పద్ధతినే శాశ్వితంగా అమలు చేయమని డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖలను, ఉద్యోగులను ఒక్కసారిగా కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తూ దశలవారిగా తరలించడమే మంచిది. లేకుంటే ఇటువంటి ప్రయత్నాలు ఎన్నిసార్లు చేసినా వాటిని వాయిదా వేసుకోక తప్పదు.