ప్రత్యేకహోదా కోసం తెదేపా చాలా కాలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. కాంగ్రెస్ కూడా పోరాడుతోంది. ఈ మధ్యనే వైకాపా, వామపక్షాలు కూడా పోరాటం మొదలుపెట్టాయి. నటుడు శివాజీ అధ్యక్షతన ప్రత్యేకహోదా సాధన సమితి కూడా పోరాడుతోంది. పవన్ కళ్యాణ్ కూడా దాని గురించి అప్పుడప్పుడు పలవరిస్తుంటారు. మిగిలిన అన్ని పార్టీలను తన వెనుక నడవమని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెపుతుంటారు. ప్రత్యేకహోదా గురించి ఏవిధంగా పోరాడాలనే విషయంపై వైకాపాతో పాఠాలు చెప్పించుకొనే దుస్థితి తమకు లేదని తెదేపా వాదిస్తుంది. తమ యుపియే ప్రభుత్వమే చాలా ఉదార హృదయంతో రాష్ట్రానికి ప్రత్యేకహోదా మంజూరు చేసినప్పటికీ తెదేపా-బీజేపీలు దానిని అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ వాదిస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకహోదాపై మాట్లాడే నైతిక హక్కు లేదని తెదేపా వాదిస్తుంది. ఈ దేశముదురు రాజకీయ పార్టీలనన్నిటినీ కూడా నిన్నగాక మొన్న ఉద్భవించిన సాధన సమితి తమతో కలిసి పోరాడమని చెపుతుంది. కానీ అందరూ కలిసికట్టుగా పోరాటం చేయరు? ఎవరి పోరాటాలు…ఆరాటాలు వారివే.
వారి మధ్య నెలకొని ఉన్న రాజకీయ విభేదాలు అందుకు ఒక కారణమయితే, ఈ పోరాటం ద్వారా వచ్చే ఖ్యాతి కేవలం తమకే దక్కాలనే వాటి ఆలోచన మరొక కారణంగా చెప్పుకోవచ్చును. అందుకే శివాజీ నిరాహార దీక్షకి కూర్చుంటే ఏ రాజకీయ పార్టీ అటువైపు వెళ్ళదు. మద్దతు ఇమ్మని వేడుకొంటున్నా పవన్ కళ్యాణ్ స్పందించడు. ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చేన్నన ఆ పెద్దమనిషి కనీసం ఆ చిన్న పని కూడా చేయకుండా తను సినిమాలు తీసుకొంటూ, ఆంధ్రా ఎంపీలు ప్రత్యేకహోదా గురించి పోరాడకుండా వ్యాపారాలు చేసుకొంటున్నారని దెప్పిపొడుస్తుంటారు.
ఈవిధంగా ఎవరి సమస్యలు, కారణాలు, అవసరాలు, ప్రయోజనాలు వారు చూసుకొంటూ ప్రత్యేకహోదా గురించి మాట్లాడేస్తున్నారు. తమ స్వంత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలే మిన్న అన్నట్లు మాట్లాడే ఈ నేతలందరూ నిజంగా చిత్తశుద్ది ఉంటే అందరూ ఒక్క వేదికపైకి వచ్చి కలిసికట్టుగా పోరాటం ఆరంభిస్తే ప్రత్యేకహోదాయే కాదు.. మొత్తం అన్ని హామీలు అమలు చేయకతప్పని పరిస్థితి కేంద్రానికి ఏర్పడుతుంది. కానీ ఆ ఖ్యాతిని ఇతరులకి, ముఖ్యంగా తమ రాజకీయ విరోధులకి వాటాలు వేసి పంచడానికి ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు కనుక ఎవరి పోరాటాలు వారివే…ఎవరి ఆరాటాలు వారివే… అందుకే కేంద్రం కూడా అంత ధీమాగా ఉందని చెప్పవచ్చును.