తమిళనాడులో మళ్ళీ జయలలితకే అధికారం దక్కే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. తమిళనాడులో మొత్తం మొత్తం 234 స్థానాలు ఉండగా, ఇంతవరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో అధికార అన్నాడిఎంకె పార్టీ 133 స్థానాలలో ఆధిక్యత సాధించి 4 స్థానాలలో విజయం సాధించింది. రెండు రోజుల క్రితం వెలువడిన సర్వే ఫలితాలలో ఆమె ఓడిపోబోతోందని, ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని వేసిన అంచనాలు తలక్రిందులయ్యాయి. డిఎంకె పార్టీ 89 స్థానాలలో ఆధిక్యత సాధించి 4 స్థానాలలో విజయం సాధించింది. ఈసారి ఎన్నికలలో తమ పార్టీయే భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని, తానే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్నానని గొప్పలు చెప్పుకొన్న డిఎండికె అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ స్వయంగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంటే, ఆ పార్టీకి ఇంత వరకు ఒక్క స్థానంలో కూడా ఆధిక్యత సాధించలేకపోయింది. పార్టీలో నేతల పట్ల, మీడియా ప్రతినిధుల పట్ల, తమిళనాడు ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే రజనీ కాంత్ పట్ల చాలా చులకనగా మాట్లాడి అహంకారం ప్రదర్శించుకొన్నందుకు రాష్ట్ర ప్రజలు చాలా గట్టిగ బుద్ధి చెప్పారని భావించవలసి ఉంటుంది. ఆయన పార్టీతో పొత్తులు పెట్టుకొన్నందుకు పి.ఎం.కె.ని కూడా ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీ ఒకే ఒక స్థానంలో ఆధిక్యతలో ఉంది.