భాజపా చాలా కాలంగా దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలని కలలుకంటోంది. కానీ నేడు వెలువడుతున్న ఫలితాలలో దక్షిణాది రాష్ట్రాలలో కేరళలో మాత్రం ఒకే ఒక్క సీటు గెలుచుకోగలిగింది. తమిళనాడులో భాజపాని అక్కడి ప్రజలు అసలు పట్టించుకోలేదు.ఈశాన్య రాష్ట్రమైన అసోంలో మాత్రం కమలం వికసించడంతో భాజపా సంతోషానికి అవధులు లేవు. ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం 126 స్థానాలు ఉండగా వాటిలో 36 గెలుచుకొని మరో 52 స్థానాలలో ఆధిక్యతతో దూసుకుపోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కేవలం 5 సీట్లు గెలుచుకొని మరో 19 స్థానాలలో ఆధిక్యత సాధించగలిగింది. అసోంలో ఈసారి కాంగ్రెస్, భాజపాలకు 50:50 అవకాశాలు ఉండవచ్చని మొదట సర్వేలు సూచించినప్పటికీ, పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన సర్వే ఫలితాలన్నే భాజపాకే విజయావకాశాలున్నట్లు స్పష్టం చేసాయి. వాటికి అనుగుణంగానే భాజపా విజయపథంలో దూసుకుపోతోంది. భాజపా ఇప్పటికే దొడ్డిదారిన అరుణాచల్ ప్రదేశ్ ని హస్తగతం చేసుకొంది. కనుక ఈశాన్య రాష్ట్రాలలో రెండు దాని చేతికి వచ్చినట్లయింది.