తమిళనాడులో మొత్తం (234 స్థానాలు): ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి జయలలితే మళ్ళీ గెలుస్తుందని ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సర్వేలు సూచించాయి. పోలింగ్ జరిగిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలలో జయకు ఓటమి ఖాయం అని తేల్చి చెప్పాయి. దానితో గత మూడు రోజులుగా ఆమె ఇంటి ముందు శ్మశాన నిశబ్ధం తాండవించింది. ఆమెకు వీర విధేయులు కూడా ఆమె నివాసంవైపు తొంగి చూడటం మానేశారు. కానీ అనూహ్యంగా మళ్ళీ ఆమె విజయం సాధించారు. దానితో మళ్ళీ అందరూ పరుగున వచ్చి ఆమెకి వంగివంగి దండాలు పెడుతూ, కాళ్ళకి స్రాష్టాంగ ప్రమాణాలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. అన్నాడిఎంకె పార్టీ 134 సీట్లు గెలుచుకొని తిరుగులేని విజయం సాధించింది. ఈసారి తప్పకుండా గెలుస్తుందనుకొన్న డిఎంకె పార్టీ 98 సీట్లు సాధించి విజయానికి కనుచూపు మేరలో నిలిచిపోయింది. ఇంక భాజపాకి కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కెప్టెన్ విజయ కాంత్ తో సహా ఆ పార్టీలో మొత్తం అందరూ ఓడిపోయారు.
కేరళలో ఊహించినట్లుగానే వామపక్ష ఎల్.డి.ఎఫ్. 140 స్థానాలలో 88 దక్కించుకొని తిరుగులేని విజయం సాధించింది. అధికార యు.డి.ఎఫ్. 51 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష బెంచీలలో కూర్చోవడానికి సిద్దపడుతోంది. అనేక ఏళ్లపాటు పదేపదే ప్రయత్నించిన తరువాత కేరళలో మొట్టమొదటిసరిగా భాజపా ఒకే ఒక్క సీటు గెలుచుకొంది. మాజీ కేంద్రమంత్రి ఓ.రాజగోపాల్ భాజపాకి రాష్ట్రంలో బోణీ చేశారు.
పుదుచ్చేరిలో శాసనసభలో ఉన్న 30 కాంగ్రెస్ పార్టీ-17 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది కనుక ఇతరుల మద్దతుతో అదే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఎ.ఐ.ఎన్.ఆర్.సి.-08, అన్నాడిఎంకె-04, ఇతరులు-01 సీటు గెలుచుకొన్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఊహించినట్లుగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించి కాంగ్రెస్, వామపక్షాలకు కంగు తినిపించింది. మొత్తం 294 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 211 సీట్లు గెలుచుకొంది. కాంగ్రెస్+వామపక్షాలు 76 సీట్లు గెలుచుకొన్నాయి. విశేషం ఏమిటంటే, భాజపా కూడా 06 సీట్లు గెలుచుకొంది. ఇది భాజపాకి మంచి పరిణామమే. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోగలిగితే దానిని ప్రజలు ఆదరించే అవకాశం ఉన్నట్లు ఇది సూచిస్తున్నట్లే భావించవచ్చు.
అసోంలో ఊహించినట్లుగానే భాజపా 126 సీట్లలో ఏకంగా 86 సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దీనితో రాష్ట్రంలో 15 కాంగ్రెస్ పార్టీ సుదీర్గ పాలన ముగిసింది. కాంగ్రెస్ పార్టీ-26,ఏ.ఐ.యు.డి.ఎఫ్.-13, ఇతరులు-1 సీటు గెలుచుకొన్నారు.