ఇవ్వాళ్ళ వెలువడిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ వంటివేనని చెప్పక తప్పదు. చిరకాలంగా పరిపాలిస్తున్న అసోం రాష్ట్రం చేజారిపోగా, ఐదేళ్ళకోసారి ప్రభుత్వాలని మార్చే కేరళ ప్రజల అలవాటు కారణంగా అక్కడ అధికారం పోగొట్టుకొంది. ఈసారి ఎలాగయినా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడింఛి అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయంతో తనను తీవ్రంగా వ్యతిరేకించే బద్ధ శత్రువు వామపక్షాలతో చేతులు కలిపినా ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు సరికదా కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం వలననే తాము ఓడిపోయామని వామపక్షాలు నిందిస్తున్నాయి.
తమిళనాడు ప్రజలు కూడా ప్రతీ ఐదేళ్ళకి అధికారంలో ఉన్న పార్టీని దింపేసి ప్రతిపక్ష పార్టీకి అధికారం అప్పజెప్పే అలవాటు ఉంది కనుక ప్రతిపక్షంలో ఉన్న డిఎంకె పార్టీతో చేతులు కలిపితే, కాంగ్రెస్ లెగ్గు మహత్యమో ఏమో అది గెలిచినట్లే గెలిచి ఓడిపోయింది. దానితో అక్కడా కాంగ్రెస్ పార్టీకి డిఎంకె తంబిల శాపనార్ధాలు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ మనుగడకి అత్యవసరమైన నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయిన తరువాత కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చచ్చీజడీ 17 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్ పార్టీకి అది విజయం క్రింద లెక్కరాదు. ఆ విజయం వలన దానికి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగలలేదు. అయితే ఇటువంటి ఓటములు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి కనుక వాటిని అది చాలా తేలికగానే జీర్ణించుకోగలదు. ఇప్పటికే అది వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది.