భారతీయ జనతా పార్టీ గురువారం మరో సంచలనాత్మక విజయం సాధించింది. ఒకప్పుడు తన ఉనికి నామమాత్రమైన అస్సాంలో ఘన విజయం సాధించింది. అతిపెద్ద ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించింది. రెండు స్థానిక పార్టీలతో కూటమి కట్టిన బీజేపీ, వ్యూహాత్మకంగా వ్యవహరించి ఫలితాన్ని దక్కించుకుంది.
తెలంగాణలో బీజేపీ ఉనికి ప్రబలంగా ఉన్న రోజుల్లో అస్సాంలో ఆ పార్టీ నామమాత్రం. ఉమ్మడి ఏపీలో 12 అసెంబ్లీ సీట్లు, 4 లోక్ సభ సీట్లు గెలిచిన బీజేపీ, ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 1984లో హన్మకొండ లోక్ సభ నియోజకవర్గంలో పీవీ నరసింహారావును ఓడించిన చరిత్ర తెలంగాణ బీజేపీకి ఉంది.
ఉమ్మడి ఏపీలో వెంకయ్య నాయుడే రాష్ట్ర బీజేపీకి పెద్ద దిక్కు. రెండేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కమలం వికసించే దిశగా పురోగమిస్తుందని భావించారు. ఎన్నికల ప్రచారంలో మోడీ హవాను క్యాష్ చేసుకోడంలోనూ తెలంగాణ బీజేపీ నేతలు విఫలమయ్యారు. చాలాచోట్ల మొక్కుబడిగా ప్రచారం జరిగింది. మోడీ ప్రభావం పుణ్యమా అని ఒక లోక్ సభ, ఐదు అసెంబ్లీ సీట్లు దక్కాయి. అదీ, టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి.
కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో కేడర్ కు కొత్త ఉత్తేజం వచ్చింది. తెలంగాణలో మాత్రం నిస్తేజం ఆవరించినట్టు కనిపించింది. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయడానికి గట్టి ప్రయత్నం జరగలేదు. ఒకప్పుడు హైదరాబాదులో ఎవరూ విస్మరించలేని పార్టీగా బీజేపీకి పేరుండేది. కనీసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలవడానికి ముందస్తు ప్రణాళిక లేకుండా పోయింది. టీడీపీతో పొత్తు చివరిదాకా పొసగలేదు. ఎవరు ఏ సీటులో పోటీ చేస్తారో తెలియదు. అంతా సస్పెన్స్. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలిసినప్పుడు, ముందే కేడర్ ను బలోపేతం చేసుకోవడం, పొత్తు వ్యవహారం తేల్చుకోవడంపై దృష్టి పెట్టలేదు.
చాలా మంది నాయకులు అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. దీంతో ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. నగరంలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. కనీసం తలా ఒక సీటు గెలిపించుకున్నా 5 డివిజన్లు దక్కేవి. అదికూడా జరగలేదు. అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు సహా నలుగురు ఎమ్మెల్యేలు ఒక్క డివిజన్ లో కూడా పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఒక్క రాజా సింగ్ మాత్రం తన నియోజకవర్గంలోని ఒక డివిజన్లో బీజేపీని గెలిపించుకున్నారు. మొత్తం మీద 4 డివిజన్లలో మాత్రమే కమలం వికసించింది.
తెలంగాణలో ఒకప్పుడు బీజేపీ బలంగా ఉన్నప్పుడు అస్సాంలో నామమాత్రపు పార్టీ. అలాంటిది ఇప్పుడు అధికారంలోకి రావడం వెనుక నాయకులు, కార్యకర్తల కృషి ఉంది. మోడీ స్ఫూర్తితో దూకుడుగా పనిచేసి విజయం దక్కించుకున్నారు. ఇది చూసైనా తెలంగాణ బీజేపీ శ్రేణులకు కొత్త జోష్ వస్తుందేమో చూద్దాం.