నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సీనియర్ కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫలితాలు ముందే ఊహించినవే..ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు జయాపజయాలు చాలా సామాన్యమే,” అని అన్నారు. ఆయన చెప్పిన దానిని బట్టి ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని వారికి ముందే తెలుసని స్పష్టం అవుతోంది. బహుశః అందుకే రాహుల్ గాంధీ చేత దక్షిణాది రాష్ట్రాలలో ప్రచారానికి డుమ్మా కొట్టించారేమో? ఎందుకంటే ఏదో ఒకరోజు పార్టీ పగ్గాలు, వీలయితే ప్రధానిగా దేశ పగ్గాలు చేప్పట్టాలని కలలు కంటున్న రాహుల్ గాంధీకి ఈ ఓటమి తాలూకు అప్రదిష్ట అంటకూడదనే జాగ్రత్త తీసుకొన్నారేమో?
కాంగ్రెస్ పార్టీకి ఈ అలవాటు చాలా కాలం నుంచే ఉంది. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని పసిగట్టడంతో రాహుల్ గాంధీకి ఆ అప్రదిష్ట సోకకూడదనే ఉద్దేశ్యంతో సోనియా గాంధీయే పార్టీకి నేతృత్వం వహించడం గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది. మళ్ళీ నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడగానే సోనియా గాంధీ మీడియా ముందుకు వచ్చి ఈ ఓటమికి తనదే బాధ్యత అని చెప్పడం గమనిస్తే, ఎవరూ కూడా ముఖ్యంగా తన పార్టీలో ఎవరూ తన కొడుకుని వేలెత్తి చూపకుండా ముందు జాగ్రత్త పడుతున్నారేమోననిపించక మానదు.
ఆమె అవునన్నా కాదన్నా, ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ వెళ్ళినా డుమ్మా కొట్టినా కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్నందుకు ఆయన కూడా ఈ ఓటమికి బాధ్యత వహించకతప్పదు. ఎన్నికలలో పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంటే జ్వరం తెచ్చేసుకొని అమ్మ కొంగు చాటున దాక్కోవడం, ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలున్నాయని తెలిస్తేనే ప్రచారానికి వెళ్లి పార్టీ బాధ్యత స్వీకరించడం నాయకత్వ లక్షణాలు కావు. అయినా ఇంకా ఎంత కాలం సోనియా గాంధీ తన ముద్దుల కొడుకుని కోడిపెట్ట తన పిల్లలను రెక్కల క్రింద పెట్టుకొని కాపాడుకొన్నట్లుగా కాపాడగలరు? తల్లి సంరక్షణలో ఉన్న ఆయన ఇంక కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని ఏవిధంగా కాపాడగలరు?
పార్టీ గెలిచినప్పుడు రాహుల్ గాంధీ ఖాతాలో ఆ క్రెడిట్ జమా చేయడం, ఓడిపోయినప్పుడు దానిని తల్లి పద్దులో జమా చేయడం వలన ఆయన పట్ల ప్రజలలో, పార్టీ క్యాడర్ లో చులకన భావం ఏర్పడేలా చేస్తుంది తప్ప అ రెండు పద్దుల విధానం ఆయనని అపజయాల అప్రదిష్ట నుంచి కాపాడలేదు. నిజం చెప్పాలంటే ఆయన ధైర్యంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ ఓడిపోయినా దానిని తల్లి లాగే హుందాగా స్వీకరించగలిగితే ప్రజల, పార్టీ క్యాడర్ దృష్టిలో ఆయన ఇంత చులకన అయ్యేవారు కారేమో.
ఈ ఫలితాలను సమీక్షించుకొని, ఆత్మవిమర్శ చేసుకొని పార్టీలో తప్పొప్పులను సవరించుకొని ముందుకు సాగుతామని సోనియా గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడల్లా ఆమె మొక్కుబడిగా ఈ మాటలు చెపుతూనే ఉన్నారు తప్ప నిజంగా ఏనాడూ ఆ పని చేయలేదు. చేసి ఉండి ఉంటే నేడు కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఎదురయ్యేదే కాదు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య ఉందని సోనియా గాంధీతో సహా ఆ పార్టీలో అందరికీ తెలుసు. రాహుల్ గాంధీకి పార్టీని నడిపించగల శక్తి సామర్ధ్యాలు, తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు లేవని అందరికీ తెలుసు. అందుకే ఆయనకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఆమె సైతం భయపడుతున్నారు. కానీ పుత్రప్రేమ కారణంగా పార్టీ పగ్గాలను మరొకరికి అప్పగించలేకపోతున్నారు. అందుకే పార్టీ క్రమంగా క్షీణిస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా ప్రియాంకా వాద్రాని ముందుకు తీసుకువస్తున్నట్లున్నారు. ఆమె పట్ల దేశంలో కాంగ్రెస్ జీవులకి, చాలా మంది ప్రజలకి కూడా ఎంతో కొంత సదాభిప్రాయమే ఉంది కనుక ఆమె కాంగ్రెస్ ని కాపాడగలరని భావిస్తున్నట్లున్నారు. అంటే నాయకత్వ లోపం ఉందని కాంగ్రెస్ అధిష్టానం గ్రహించినట్లే ఉంది. ఇప్పటికైనా ఆ ఆ సమస్యను సరిదిద్దుకొంటే మంచిదే.