చంద్రబాబు నాయుడు నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రికి రాని సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాను. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి హామీల అమలు కోసం ఒత్తిడి చేస్తూనే ఉన్నాను. ఎవరు ఏవిధంగా వ్యవహరిస్తున్నా నా పని నేను చేసుకొనిపోతూనే ఉన్నాను. అయినా ప్రతిపక్ష పార్టీల నేతలు నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. పత్రికలూ పెట్టుకొని నా గురించి, నా ప్రభుత్వం గురించి పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. మనకి ఇంత పెద్ద రాజధాని అవసరమా? అని ఒకరు, నేను ఎవరికో భయపడుతూ రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెడుతున్నానని, రాజధానిలో బారీగా అవినీతి జరిగిపోతోందని మరొకరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు. రాజధాని మన ఆత్మగౌరవానికి ప్రతీక వంటిది కనుక దానిని చూసి అందరూ గర్వపడేలా నిర్మించాలనుకోవడం తప్పా?” అని ప్రశ్నించారు.
“రాజధానిలో అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేసినవారు, నిరూపించమంటే అసెంబ్లీ నుంచి పారిపోయారు. నా సహనానికి కూడా హద్దు ఉంటుంది. నాపై అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తే నేను కూడా అందుకు తగ్గట్లుగానే స్పందించవలసి వస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు కనుక ఎవరికీ భయపడవలసిన అవసరం నాకు లేదు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాల కంటే నాకు ఏది ముఖ్యం కాదు. ప్రజలకి నాపై నమ్మకం ఉండబట్టే అధికారం ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయను. మిగిలిన ఈ మూడేళ్ళతో వీలయినంతగా రాష్ట్రాభివృద్ధి చేసి చూపిస్తాను. అనవసరంగా నాజోలికి వచ్చిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టను,” అని హెచ్చరించారు.
దేశంలో మరే ముఖ్యమంత్రి ఎదుర్కొని సమస్యలు, కష్టాలు చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. వాటిని పరిష్కరించడానికి ఆయన శత విధాల ప్రయత్నిస్తున్నారని కూడా ప్రజలకి తెలుసు. కేంద్రంతో, పొరుగు రాష్ట్రం తెలంగాణాతో ఉన్న సమస్యలు, అవరోధాలు, వ్యక్తిగత ఇబందుల గురించి కూడా అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన ఆ కారణాల వలననే ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదని కూడా ప్రజలకి తెలుసు. అలాగే రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న శల్యసారధ్యం గురించి కూడా అందరికీ తెలుసు. కానీ ఇటువంటి సమస్యలన్నిటినీ తాను మాత్రమే పరిష్కరించగలనని ఆయనే స్వయంగా ప్రజలకు భరోసా ఇచ్చినందునే ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. కనుక ఇప్పుడు ఆయన ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోవడం కంటే వారి నమ్మకాన్ని నిలబెట్టుకోనేందుకే గట్టి ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. ఆయన కేంద్రాన్ని హామీలు అమలు చేయమని ఇప్పుడు ఏవిధంగా ఒత్తిడి చేస్తున్నారో, అదే విధంగా రాష్ట్ర ప్రజలు కూడా ఆయన ఇచ్చిన హామీలని అమలుచేసి చూపాలని ఆశిస్తే తప్పులేదు. కానీ వచ్చే ఎన్నికలలో తన వైఫల్యాలకు కేంద్రాన్నో, పొరుగు రాష్ట్రాన్నో లేదా రాష్ట్రంలో ప్రతిపక్షాలనో నిందిస్తే ప్రజలు అంగీకరించక పోవచ్చు. ముఖ్యంగా సింగపూర్ వంటి రాజధానిని నిర్మించి చూపుతానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కానీ రెండేళ్ళు పూర్తయిపోయినా ఇంతవరకు నిర్మాణ పనులే మొదలవలేదు. ఇంకా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కనీసం వచ్చే ఎన్నికల నాటికి రాజధాని నిర్మాణ పనులు మొదలుకాకపోయినట్లయితే, అప్పుడు ఇంకేమి చెప్పినా ప్రజలు వినకపోవచ్చు.