ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇక నుంచి రాజధాని ప్రాంతంలో వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోనే నిర్వహిస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు నిన్న మీడియాకి తెలిపారు. తాత్కాలిక సచివాలయంలోనే శాసనసభ, విధానసభ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా ఒక అంతస్తుని కేటాయించారు. దానిలోనే సమావేశాల నిర్వహణకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏడాది ఆగస్ట్ సెప్టెంబర్ నెలల మధ్య జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు అందులోనే జరుగుతాయని స్పీకర్ కోడెల తెలిపారు.
జూలై నెలాఖరుకల్లా తాత్కాలిక సచివాలయం పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వాలనే షరతు మీద రాష్ట్ర ప్రభుత్వం ఎల్.అండ్.టి, షాపోర్ జీ సంస్థలకు కాంట్రాక్టు అప్పగించింది. అందుకు అవి అంగీకరించి శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులలో కొందరు మొన్న బుధవారంనాడు వెలగపూడి వచ్చి తాత్కాలిక సచివాలయాన్ని, దాని పరిసర ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులలో కొంత మంది కొన్ని ఇబ్బందులు, కారణాల చేత ఇంకా సమయం కోరుతున్నప్పటికీ, చాలా మంది జూన్ 27వ తేదీ నుంచి వెలగపూడికి వచ్చి తాత్కాలిక సచివాలయంలో పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తాత్కాలిక సచివాలయమలో రెండు అంతస్తులే నిర్మిస్తున్నప్పటికీ, వివిధ శాఖల కమీషనరేట్స్, ప్రధాన కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటు చేస్తే పరిపాలనకి సౌలభ్యంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో, మరో మూడు అంతస్తులు నిర్మించడానికి అవే సంస్థలకు పనులు అప్పగించబోతోంది. అది కూడా పూర్తయ్యి అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఏర్పాటయితే అదే రాష్ట్ర ప్రధాన పరిపాలన కేంద్రంగా మారుతుంది. అధికారులు, ఉద్యోగులు తరలివచ్చి పనిచేయడం మొదలై, అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగితే వెలగపూడికి ఇంక రాజధాని కళ వచ్చేస్తుంది.