2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన చిరంజీవి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను చీల్చడంతో తెదేపా చాలా నష్టపోయింది. ఆయన ఓట్లు చీల్చగలిగారు కానీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకోవడం చేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక తను అంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీని అసహ్యించుకొన్నారో దానిలోనే తన రాజ్యాన్ని విలీనం చేసేసి కేంద్ర మంత్రి పదవి పుచ్చుకొని సంతోషపడ్డారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డిఎండికె అధినేత విజయ్ కాంత్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రతిపక్ష డిఎంకె పార్టీ విజయావకాశాలను దెబ్బ తీసారు. చాలా చోట్ల డిఎంకె అభ్యర్ధులు తమ సమీప ప్రత్యర్ధి అన్నాడిఎంకె చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకు కారణం ఆ నియోజక వర్గాలలో ప్రజల ఓట్లను డిఎండికె చీల్చడమే.
జయలలిత తరువాత తానే ముఖ్యమంత్రి కాబోతున్నానని ప్రగల్భాలు పలికిన విజయ్ కాంత్ స్వయంగా ఓటమి పాలవడమే కాకుండా, ఆయన పార్టీలో అందరూ ఓడిపోయారు. చాలా మందికి డిపాజిట్లు కూడా రాలేదని సమాచారం. వారు గెలవలేకపోయినా అందరూ కలిసి డిఎంకె గెలవకుండా సైందవులలాగ అడ్డుపడ్డారు. పోలింగ్ జరిగిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో కూడా డిఎంకె పార్టీ గెలుపు తధ్యమని సూచించాయి. ఊహించినట్లుగానే డిఎంకె పార్టీ 98సీట్లు గెలుచుకొని విజయానికి అతి సమీపంలోకి వచ్చింది కానీ డిఎండికె పార్టీ మధ్యలో సైంధవుడిలాగ అడ్డుపడినందున ఓటమి పాలయింది. అందుకే తమిళనాడు రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఖ్యాతి, భాగ్యం జయలలితకు దక్కాయి. అందుకు ఆమె విజయ్ కాంత్ కి చాలా రుణపడి ఉండాలి.
కానీ 93 ఏళ్ల వయసులో కూడా ఆఖరిసారిగా ముఖ్యమంత్రి పదవి చేప్పట్టి, తన కొడుకులు అళగిరి, స్టాలిన్ లను రాజకీయ సుస్థిరత కల్పిద్దామనుకొన్న కరుణానిధికి తీవ్ర నిరాశ మిగిల్చారు కనుక ఆయన శాపనార్ధాలను విజయ్ కాంత్ స్వీకరించక తప్పదు.