ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సూచించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ విషయం బయటపెట్టారు. రామోజీ రావు రాజధానికి ఆ పేరు సూచించడమే కాకుండా దాని గొప్పదనాన్ని తెలియజేసే చారిత్రిక వివరాలను కూడా తనకు పంపారని తెలిపారు. శాతవాహనుల కాలంలో అమరావతి అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా విరాజిల్లిందని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఆ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే కోరికతోనే ఆ పేరును ఖరారు చేసామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరావతి నగరాన్ని నిర్మిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
అమరావతి ప్రజారాజధాని…దానిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి..అది కలకాలం జీవకళతో ఉట్టిపడుతుండాలి..అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పారు. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దగ్గర నుంచి దాని పేరు ఎంపిక వరకు అన్నీ ప్రజల, ప్రతిపక్షాల ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకొన్నారు. చివరికి దాని మాష్టర్ ప్లాన్ గీసే బాధ్యత, నిర్మాణ పనులను కూడా విదేశీ సంస్థలకే కట్టబడుతున్నారు.
ఒకవేళ చంద్రబాబు నాయుడు కలలుకంటున్నట్లుగా అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మాణం జరిగితే, ఆ స్థాయిలో సౌకర్యాలు పొందడానికి అందులో నివసించే ప్రజలు చాలా బారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. కనుక అందులో సామాన్య ప్రజలకు చోటు ఉండకపోవచ్చు. కానీ నిజంగానే ఆ స్థాయిలో నగరం నిర్మించగలిగితే అది దేశానికే గర్వ కారణం అవుతుంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా ఏర్పడవచ్చు. ఇంతకీ అమరావతిని ఈ తరంలో వాళ్ళు చూసే భాగ్యం ఉందో లేదో?