హైదరాబాద్: రాష్ట్రాన్ని దేశంలోకెల్లా నంబర్ వన్ రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా మారుస్తానన్న శపథాల సంగతి దేవుడెరుగుగానీ, తాను మాత్రం దేశంలోకెల్లా నంబర్ వన్ ముఖ్యమంత్రిగా మారిపోయారు కేసీఆర్…విలాసాల విషయంలో. అవును, రాష్ట్రపతి, ప్రధానమంత్రి తర్వాత దేశంలో అత్యంత ఖరీదైన వాహనాల కాన్వాయ్ వాడుతున్నది కేసీఆరే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన టయోటో ల్యాండ్ క్రూజర్ ప్రోడో వాహనాలతో కేసీఆర్ ఈ ఘనత సాధించారు. ఈ వాహనం ఒక్కొక్కదాని విలువ అక్షరాలా రు.1.30 కోట్లు. ఇలాంటివి ఐదు వాహనాలను కొనుగోలు చేశారు. మళ్ళీ వీటిలో ఒకదానిని బుల్లెట్ ప్రూఫ్ చేయించారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలో బుల్లెట్ ప్రూఫ్ చేయించిన ఈ కారువిలువ మిగిలినవాటికంటే అధికంగా ఉంటుంది. నిన్న వీటికి యాదగిరిగుట్టలో ప్రత్యేకపూజలు చేయించారు.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో నలుపురంగు టయోటో ఫార్చూనర్ వాహనాలను కేసీఆర్ వాడారు. తర్వాత ఆంధ్రా సిద్ధాంతులు నలుపురంగు వద్దన్నారో, ఏమోగానీ తెల్లరంగు వాహనాలను కొనుగోలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ల్యాండ్ క్రూజర్‌లు. మరోవైపు, జిల్లాలలో పర్యటనకోసం ఇప్పటికే ఐదుకోట్లతో అత్యంత విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కంపెనీ బుల్లెట్ ప్రూఫ్ బస్సును ఇటీవల కొనుగోలు చేయటం, అది డెలివరీ అయిన తర్వాత సీఎమ్‌కు నచ్చకపోవటం సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రాణాలకు అంతపెద్ద ముప్పు ఇప్పుడేముందని(నక్సల్ బెడద ఇప్పుడు లేదని వారి వాదన) అంత డబ్బులుపోసి ఆ బస్సును కొనుగోలు చేశారంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు అప్పుడు విమర్శలు చేశాయి. అయినాకూడా ఇప్పుడు కేసీఆర్ ఈ కార్లు కొనుగోలు చేయటంపై విపక్షాలు మళ్ళీ విమర్శలదాడికి దిగే అవకాశముంది. దానికితోడు, రాష్ట్రం ఏర్పాడిన కొత్తలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు జీతాలు చెల్లించలేని, బిల్లులు కట్టలేని పరిస్థితిలోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు అప్పుల బాధలు తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలు చే సుకుంటున్న సంగతీ విదితమే. ఇలాంటి పరిస్థితులలో ఈ విలాసాలు కేసీఆర్‌కు అవసరమా అన్న ప్రశ్న తలెత్తటం సహజం. అయినా కేసీఆర్ ఏదైనా అనుకుంటే ఇలాంటి వాదనలకు, విమర్శలకు వెరవరన్నది మాత్రం వాస్తవం.