ఎన్టీఆర్తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు రచయిత వక్కంతం వంశీ. ఎన్టీఆర్ సినిమాలకు కథలు అందించిన వక్కంతం.. ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా లాంఛ్ అవుదామనుకొన్నాడు. టెంపర్.. వక్కంతం కథే. పూరి జగన్నాధ్ కోసం త్యాగం చేయాల్సివచ్చింది. `నీతో ఎప్పటికైనా సినిమా చేస్తా` అని ఎన్టీఆర్ కూడా వక్కంతంకి మాట ఇచ్చాడు, అందుకే ఈమధ్య ఎన్ని ఆఫర్లు వచ్చినా వక్కంతం చేయలేదు. ఈ సినిమాని నిర్మించడానికి కల్యాణ్ రామ్ కూడా ముందుకొచ్చాడు. ఇప్పుడు వక్కంతం నిరీక్షణ ఫలించింది. జనతా గ్యారేజీ తరవాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా వక్కంతంతోనే అన్నది ఫిక్సయ్యింది.
జనతా గ్యారేజీ ఎన్టీఆర్ 26వ చిత్రం. 27వ సినిమాని వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి పూరి మళ్లీ రెడీగా ఉన్నా ఎన్టీఆర్ మాత్రం వక్కంతంకే ఛాన్స్ ఇచ్చాడు. ఇంతకాలం ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్న వక్కంతం వంశీకి ఇది నిజంగా వరం లాంటి వార్తే. ఈ యేడాది ఆగస్టులో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.