ఎన్నికలలో గెలిచిన పార్టీలు ఒకరకంగా, ఓడిపోయినవి మరొక రకంగా మాట్లాడటం సహజమే. గెలిచినా పార్టీలు తమకే ప్రజాధారణ ఉందని గొప్పలు చెప్పుకొంటే, ఓడిపోయినవి అధికార పార్టీ ప్రజలను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకొందని ఆరోపిస్తుంటాయి. టీ-కాంగ్రెస్ నేత జానారెడ్డి మరో అడుగు ముందుకు వేసి తెలంగాణా ప్రజలకు తెరాస పట్ల ఇంకా భ్రమలు పోలేదని అన్నారు. తెరాస ప్రభుత్వం తమకు ఇంకా ఏదో చేస్తుందనే భ్రమతోనే ప్రజలు దానిని నమ్మి పాలేరు ఉపఎన్నికలలో తెరాసకి ఓట్లు వేశారని అన్నారు. అందుకే పాలేరులో గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేసినా ఓడిపోయామని విచారం వ్యక్తం చేసారు. అయితే ఎన్నికలలో జయాపజయాలు సర్వసాధారణం కనుక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మళ్ళీ కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలని అన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తున్నారు కనుక వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ది చేయాలని సూచించారు.
జానారెడ్డి చాలా హుందాగానే మాట్లాడినప్పటికీ, ఆయన కూడా అందరు రాజకీయ నేతలలాగే ప్రజలకి ఆలోచించే తెలివి తేటలు ఉండవు. ఎవరిని పడితే వారిని నమ్మేస్తారు. ప్రలోభాలకి లొంగి ఓట్లు వేస్తుంటారనే విధంగా మాట్లాడారు. కానీ తెరాస నేతలు ‘ప్రజలు చాలా వివేకవంతులు. మా వలననే రాష్ట్రానికి మేలు జరుగుతుందని బలంగా నమ్మినందునే మాకే ఓట్లు వేసి గెలిపిస్తున్నారు,’ అని చెపుతుంటారు.
జానారెడ్డి చెపుతున్నట్లుగా ఒకవేళ ప్రజలకి రాజకీయ నాయకులని, వారి మాటలని, వాటి వెనుక వారి ఉద్దేశ్యాలని, వారి నిబద్ధతని అర్ధం చేసుకొనే శక్తి లేనట్లయితే, కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని, రాష్ట్రాన్ని ఎల్లప్పటికీ పరిపాలించగలిగి ఉండేది. కానీ 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో జానారెడ్డికి కూడా తెలుసు. మళ్ళీ మొన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో కూడా నాలుగు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. పాలేరు ఉపఎన్నికలని వాటితో ముడిపెట్టి చూడలేము కానీ అక్కడ తెరాస గెలుపుకి, కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. కనుక కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పు పట్టే బదులు ముందుగా తమ పార్టీని సంస్కరించుకొని, దాని రాజకీయ అలవాట్లను, పద్దతులను మార్చుకొంటే ఎప్పటికయినా మళ్ళీ ప్రజలు దానిని ఆదరించే అవకాశం ఉంటుంది.