ఒకప్పుడు రాజకీయాలలో ఉండేవారు ఫుల్-టైం పనిచేసేవారు. కానీ ఇప్పుడు చాలా మంది పార్ట్-టైం నేతలే. కొందరికి సినిమాలు..మరికొందరికి వ్యాపారాలు, పరిశ్రమలు, ఇంజనీరింగ్ కాలేజీలు, కాంట్రాక్టు పనులున్నాయి. కనుక వాళ్ళు ఎన్నికల సమయంలో ఫుల్ టైం, మిగిలిన ఐదేళ్ళు పార్ట్-టైం రాజకీయాలు (ప్రజాసేవ) చేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అటువంటి వారికి కొదవలేదు.
తమిళనాడులో డిఎండికె అధినేత విజయ్ కాంత్ కూడా ఆ కోవకి చెందిన వ్యక్తే. మొన్న వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఆయనతో సహా పార్టీలో అందరూ ఓడిపోయారు. చాలా మందికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎన్నికలలో డిఎండికె పార్టీకి 6 కంటే తక్కువ శాతం ఓట్లు పోల్ అవడంతో దాని గుర్తింపు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితులలో ఏ పార్టీ నాయకుడైనా తన పార్టీ నేథలకి, కార్యకర్తలకి ధైర్యం చెప్తారు. కానీ విజయ్ కాంత్ మాత్రం “నేను మళ్ళీ సినిమా షూటింగులు మొదలుపెట్టేశాను. ఈ ఓటమితో ఎవరూ నిరుత్సాహం పడనవసరం లేదు. మన విజయం మరి కొంత కాలం వాయిదా పడింది. అంతే భవిష్యత్ లో మనమే అధికారంలోకి వస్తాము,” అని ట్వీట్ మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకొని షూటింగులకి వెళ్ళిపోయారు.
తను సినిమా షూటింగులలో బిజీ అయిపోయానని, అదేదో తమని ఉద్దరించడం అన్నట్లుగా ఆయన చెప్పడం చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకొంటున్నారు. ఎన్నికల సమయంలో తన పార్టీయే విజయం సాధిస్తుంది. తనే ముఖ్యమంత్రి అవుతానని విజయ్ కాంత్ పదేపదే చెప్పేవారు. తాను కింగ్ అవ్వాలి తప్ప కింగ్ మేకర్ కాదని కూడా చెప్పేవారు. ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఆయనకి చాలా కాలంగానే ఉంది. అదే ఎన్నికల సమయంలో మళ్ళీ మరోమారు బయటపెట్టుకొన్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక తీర్చుకోవడానికే ఆయన ఎన్నికలలో పోటీ చేస్తున్నారు తప్ప పార్టీని, రాష్ట్రాన్ని, ప్రజలని ఉద్ధరించడానికి కాదని ఆయన మాటలే చెపుతున్నాయి. ఆ విషయాన్ని ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పుకోవడం విశేషమే. అందుకే ప్రజలు ఆయనని మరో ఆలోచన లేకుండా తిరస్కరించారనుకోవాలి.