హైదరాబాదును విశ్వనగరంగా మార్చాలనేది తెరాస ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే బలమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈ నగరంలోకి మరిన్ని కొత్త పరిశ్రమలను రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సఫలమవుతోంది. టీఎస్ ఐపాస్ చాలా మందిని ఆకర్షిస్తోంది. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి, మెరుగైన పౌర సేవలను అందించడానికి 100 రోజుల ప్రణాళికను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వంద రోజుల గడువు దగ్గర పడింది. మరి పౌర సేవలు మెరుగయ్యాయా, యాక్షన్ ప్లాన్ సక్సెస్ అయిందా అనేది ప్రశ్న.
కేటీఆర్ ఘనమైన 100 రోజుల ప్రణాళికను ఫిబ్రవరి 18న ప్రకటించారు. ఆన్ లైన్ సేవలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. భవనాల సమాచారాన్ని 30 రోజుల్లో ఇస్తామన్నారు. సింగిల్ టైమ్ పర్మిషన్లు ఇస్తామని వాగ్దానం చేశారు.
నగరంలో కొత్తగా బీటీ రోడ్లను నిర్మిస్తామన్నారు. వీటికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. 30 కోట్లతో నాలాలను క్రమబద్ధీకరించి పూడిక
తీయిస్తామన్నారు. మహిళా సంఘాలకు 100 రోజుల్లో 100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. జీహెచ్ ఎంసి, హెచ్ ఎండి ఎలలో నిర్ణీత గడువులో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నగరంలో 40 మోడల్ మార్కెట్లను నిర్మిస్తామని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం 26 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. సిటీ బస్సు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు ప్రకటించారు. 3 కోట్ల రూపాయలతో బస్ స్టాపుల్లో 50 బస్ బేలను నిర్మిస్తామన్నారు.
ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను తీసుకుపోవడానికి 2,500 ఆటోలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇ ఆఫీసు ద్వారా ఈ పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షిస్తామని కూడా మంత్రి చెప్పారు. యువజన క్లబ్బులు, సంఘాల కోసం 359 స్టేడియంలను అభివృద్ధి చేస్తామని, జిమ్ లను ఏర్పాటు చేస్తామని వివరించారు.
40 కోట్ల రూపాయలతో కొత్తగా 32 వేల నల్లా కనెక్షన్లు ఇస్తామన్నదీ మంత్రిగారీ మాటే. మే 31 కల్లా ప్రజలకు మూడున్నర కోట్ల మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. దీనికోసం 3 కోట్ల 50 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. నగరంలో పచ్చదనం పెంచడానికి ఈ ప్లాన్ రూపొందించారు.
సివిల్ పనులు పారదర్శకంగా జరిగేలా చూడటానికి వార్డువారీగా, ప్రాంతాల వారీగా కమిటీలు వేస్తామన్నారు. ఈ యాక్షన్ ప్లాన్ అమలైందా లేదా అనేది రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్ 2న సమీక్షిస్తానని కేటీఆర్ వివరించారు. జూన్ 2వ తేదీ దగ్గర పడింది. ఈ యాక్షన్ ప్లాన్ లో ఎన్ని జరిగాయి, ఎన్ని జరగలేదు అనేది ప్రజలకు తెలుస్తూనే ఉంది. గడువులోగా పనులు పూర్తి కావాలంటే ఈ చివరి పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం కష్టపడాల్సి ఉంటుంది. మరి అధికారులు వేగంగా పనులు చేస్తారో లేక కొన్ని పెండింగులో పెడతారో చూద్దాం.