ఒకటి ప్లస్ ఒకటి ఈజీక్వల్ టూ రెండు. ఇది గణితం. ఒక్కో సారి ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు సున్నా. ఇది రాజకీయ గణితం. బెంగాల్లోని కామ్రేడ్లకు ఈ విషయం ఆలస్యంగా అర్థమైంది. తమది సిద్ధాంతాలకు నిబద్ధమైన పార్టీ అని చెప్పుకొనే సీపీఎం, ఇతర లెఫ్ట్ పార్టీల నేతలు బెంగాల్లో విజయానికి పాపం చాలా కష్టపడ్డారు. సాధారణంగా తోటి వామపక్షాలతోనే పొత్తు పెట్టుకోవడం సీపీఎం ఆనవాయితీ. దాన్ని విస్మరించినా, చివరకు మూడో స్థానానికి దిగజారడం వామపక్ష కూటమికి జీర్ణం కాని విషయమే.
బెంగాల్లో మాత్రం తమ 34 ఏళ్ల కంచుకోటను బద్దలు కొట్టిన దీదీని ఓడించడానికి చాలా ప్రయత్నించారు. చివరకు సిద్ధాంతాల విషయంలోనూ రాజీ పడ్డారు. కొన్ని దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా రాజకీయ యుద్ధం చేసిన హస్తం పార్టీతో దోస్తీ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ వార్తను తొలిసారిగా వినగానే బెంగాల్ పల్లెప్లెనా వామపక్ష కార్యకర్తలు షాకై ఉంటారు.
ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించి, తమ కంచుకోటను కైవసం చేసుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు. అంతేనా,
సీట్ల సర్దుబాటే తప్ప, ఉమ్మడి ప్రచారం ఉండదని మొదట కొందరు కామ్రేడ్లు చెప్పారు. చివరకు రాహుల్ గాంధీతో వేదికను పంచుకుని ఘనంగా ఉమ్మడి ప్రచారం చేశారు.
అధికారంలో ఉండికూడా, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని భారీ విజయాన్ని సాధించడం ద్వారా మమతా బెనర్జీ తన రాజకీయ బలాన్ని చాటారు. కామ్రేడ్లతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 44 సీట్లను సాధించి రెండో స్థానంలో నిలిచింది. హస్తంతో దోస్తీ చేసిన లెఫ్ట్ మాత్రం 33 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. పార్టీల వారీగా చూస్తే సీపీఎం మరీ 28 సీట్లకే పరిమితమైంది.
రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే ఇద్దరి ఓటు బ్యాంక్ ఒకరికొకరికి బదిలీ కావాలి. కానీ అలా జరిగిందా అనేది అనుమానమే. స్థానిక అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు కూడా ఈ విషయంలో ప్రభావం చూపుతాయి. అసలు కాంగ్రెస్ తో పొత్తు అనేదాన్ని కామ్రేడ్ల శ్రేణులు జీర్ణించుకోవడానికే చాలా సమయం పట్టి ఉంటుంది. పట్టణాల్లో, పల్లెల్లో పరస్పరం భీకర యుద్ధం చేసిన సీన్లు గుర్తుకు వచ్చి ఉంటాయి. మరోవైపు, కేరళలో జరుగుతున్న పొలిటికల్ ఫైట్ కూడా స్ఫురణకు వచ్చి ఉంటుంది.
బెంగాల్లో దోస్తీ, కేరళలో కుస్తీయా అని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ చేసిన విమర్శలు ప్రభావం చూపి ఉంటాయని కూడా పరిశీలుకలు భావిస్తున్నారు. అందుకే ఓట్ల బదలాయింపు జరగలేదని వారి అభిప్రాయం. మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవడం కాంగ్రెస్, కామ్రేడ్లకు అనివార్యం. ఆ తర్వాతైనా విజయం ఖాయమని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కేరళలో ఐదేళ్ల కోసం అధికారం మారడం ఆనవాయితీ. తమిళనాడులోనూ ఇదే ఆనవాయితీ ఉన్నా, దాన్ని జయలలిత బద్దలు కొట్టారు. కేరళలో సుపరిపాలన ద్వారా లెఫ్ట్ కూడామి కూడా 2021లో ఈ ఆనవాయితీని బద్దలు కొడతారో లేదో చూడాలి. బెంగాల్లో మాత్రం ఈ స్థాయికి దిగజారడం సీపీఎం నేతలకు ఏమాత్రం మింగుడు పడని. అయినా తప్పదు. వ్యూహం వికటించింది. ఫలితం ఒప్పుకోవాల్సిందే.