జగన్మోహన్ రెడ్డి, రఘువీరా రెడ్డి నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పేరు పెట్టి మరీ విమర్శిస్తూనే ఉంటారు కానీ ఆయన మాత్రం నేటికి వారిని ఉద్దేశ్యించి పరోక్ష విమర్శలే చేస్తుంటారు. శనివారం ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వారిరువురిపై విమర్శలు గుప్పించారు.
“మనకి ఓ మహానాయకుడున్నాడు. అతనికి రాజకీయాలు తెలియవు. దేని గురించి అవగాహన ఉండదు. కానీ మొన్న కర్నూలులో ఏదేదో మాట్లాడేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే దొంగ లెక్కలు వ్రాసుకొన్నంత తేలిక కాదు. మరొక నాయకుడు ఉన్నారు. అతని వెనుక ఎవరూ ఉండరు. కానీ ఆయన ఒక్కడే చాలా మాట్లాడుతుంటారు. దాని వలన తన పార్టీ విశ్వసనీయత, భవిష్యత్ దెబ్బ తింటోందని కూడా గ్రహించరు. వాళ్లకి రాజకీయాలే ముఖ్యం కావచ్చు కానీ నాకు రాష్ట్రం, ప్రజలు, వారి ప్రయోజనాలు, అభివృద్దే ముఖ్యం. అందుకోసం నా శక్తిమేర కృషి చేస్తూనే ఉంటాను,’ అని అన్నారు. వారిలో మొదటి వ్యక్తి జగన్, రెండవ వ్యక్తి రఘువీర రెడ్డి అని అర్ధమవుతూనే ఉంది.
ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు మళ్ళీ తన ద్వంద వైఖరిని మరోమారు బయటపెట్టుకొన్నారు. “ప్రత్యేక హోదా వస్తే నేనేమైనా వద్దంటానా? వస్తే నాకు సంతోషమే. కానీ పదేళ్ళ క్రితం హోదా పొందిన 10 రాష్ట్రాలు నేటికీ అభివృద్ధి సాధించలేకపోయాయి. ఇంకా వెనుకబడే ఉన్నాయి. 14వ ఆర్ధిక సంఘంమే ఆ విషయం స్పష్టం చేసింది. విభజన తరువాత మనం కట్టుబట్టలతో బయటకు వచ్చేము.అందరం కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని నిలబెట్టుకొంటున్నాము. రాష్ట్రానికి న్యాయం చేయాలని నేను డిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులని పదేపదే అడగవలసి వస్తోంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. ప్రజాభీష్టానికి విరుద్ధంగా తన ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొంది. రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు రాష్ట్రం కోసం మొసలి కన్నీళ్లు కార్చుతోంది. అదే ఈ సమస్యలను సృష్టించి, మళ్ళీ అదే మనల్ని విమర్శిస్తోంది,” అని అన్నారు.