ఆమ్ ఆద్మీ పార్టీలో భారీ కుదుపు. ఆ పార్టీకి ఉన్న నలుగురు ఎంపీలూ పంజాబ్ కు చెందిన వారే. వారిలో ఇద్దరు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు. మరికొందరు పంజాబ్ ఆప్ నేతలు కూడా తిరుగుబాటు శిబిరంలో చేరడానికి నిర్ణయించుకున్నారు.
ఆప్ ఎంపీలు హరిందర్ సింగ్ ఖాల్సా, ధరంవీర్ గాంధీలు ఆప్ కు టాటా చెప్పడానికి నిర్ణయించారు. అంతేకాదు, పంజాబ్ లో ఆప్ ప్రముఖ నాయకులు హర్విందర్ సింగ్ ఫూల్కా, దల్జీత్ సింగ్, జస్సీ జస్ రాజ్ తదితరులు కూడా తిరుగుబాటు జెండా ఎగురవేయాలని నిర్ణయించుకున్నారు.
కేజ్రీవాల్ ఓ నియంత అని తిరుగుబాటు ఎంపీలు విమర్శించారు. ఆయన కోటరీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆప్ నేతలు ఢిల్లీ దర్బార్ నుంచి పెత్తనం చెలాయిస్తున్నారని, పంజాబ్ ను ఓ వలస కాలనీగా భావిస్తున్నారని తిరుగుబాటు ఎంపీలు విమర్శిస్తున్నారు.
ఈ తిరుగుబాటుతో ఆప్ మాస్టర్ ప్లాన్ అమలు కావడం అనుమానమే. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆప్ తహతహలాడుతోంది. అకాలీ, బీజేప సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతోందని ఆప్ అంచనా. కాబట్టి కాంగ్రెస్ కంటే ఎక్కువగా బలపడటం ద్వారా మెజారిటీ సీట్లు సాధించాలని ఆప్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇటీవల కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటించారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది.
అయితే 2014 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పంజాబ్ నుంచి 4 సీట్లు గెల్చుకుంది. ఆప్ నేతలకే ఇది ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యమంత్రి బాదల్ కుటుంబ పాలన, అభివృద్ధి సంక్షేమం అంతగా కనిపించక పోవడం, అప్పటి యూపీఏ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వల్ల ఆప్ కు అంతటి విజయాలు దక్కాయని విశ్లేషించుకున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో విజయం సాధించాలనేది కేజ్రీవాల్ లక్ష్యం. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు, మరికొందరు బలమైన నాయకులు తిరుగుబాటు చేస్తే ఆప్ బలహీన పడుతుంది. చీలిక వర్గం బలం పుంజుకుంటే అప్పుడు ఆప్ ఓట్లు రెండు వర్గాల మధ్య చీలిపోవచ్చు. ఈ పరిణామం అకాలీ, బీజేపీ కూటమికి సంతోషం కలిగించడం ఖాయం. గెలిచిన కొన్ని రోజులకే పంజాబ్ లోని ఎంపీలు ఆప్ ఢిల్లీ దర్బార్ పై అసంతృప్తి ప్రకటించారు. అప్పట్లో కేజ్రీవాల్ అనునయించారు. ఆ తర్వాత కూడా పద్దతిని మార్చుకోలేదు. ఫలితంగా ఉన్న ఎంపీల్లో ఇద్దరిని దూరం చేసుకోవడమే కాదు, నిలువునా పార్టీ చీలిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇది ఆప్ అధినేత స్వయంకృతమే.