భారీ అంచనాల మధ్య బ్రహ్మోత్సవం నిన్న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజు వసూళ్లు అదరగొట్టేస్తాయని, సర్దార్ – గబ్బర్ సింగ్ వసూళ్లు దాటేస్తాయని అభిమానులు ఆశించారు. కానీ తొలిరోజు వసూళ్లు మాత్రం ఫ్యాన్స్‌ని నిరాశలో ముంచెత్తాయి. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో.. దాదాపు రూ.13 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్, మిగిలిన రాష్ట్ర్రాల్లో రూ.4 కోట్లు సాధించింది. అంటే.. తొలి రోజు 17 కోట్లు తెచ్చుకొందన్నమాట. తొలి రోజు వసూళ్లలో బాహుబలి తొలి స్థానంలో ఉండేది. దాన్ని సర్దార్ బ్రేక్ చేశాడు. శ్రీమంతుడు మూడో స్థానంలో ఉంది. కనీసం బ్రహ్మోత్సవం శ్రీమంతుడు రికార్డును కూడా చేరుకోలేకపోయింది.
ఆంధ్రాలో చాలా చోట్ల ఈ సినిమాకి అనుకొన్న సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. ఆ ప్రభావం వసూళ్లపై పడి ఉండొచ్చని తెలుస్తోంది. పైగా వర్షాల ప్రభావంతో వసూళ్లు తగ్గాయి. శని, ఆదివారాల్లో కూడా వసూళ్లు డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. అయతే మల్టీప్లెక్స్‌లో తొలి మూడు రోజుల ఆటలకు ముందే అడ్వాన్సు బుకింగులు జరిగిపోయాయి. అందుకే.. చిత్రబృందం కాస్త రిలీఫ్‌గా ఉంది. సోమవారం నుంచి బ్రహ్మోత్సవం భవిష్యత్తు పూర్తిగా బయటపడిపోతుంది.