భారత్, పాకిస్తాన్ ల మధ్య తేడా ఏమిటనేది ఇప్పుడు అమెరికా నాయకులు స్పష్టంగా అర్థమవుతోంది. ఉగ్రవాదంపై పోరాడేది ఎవరో, దాన్ని ప్రోత్సహించేది ఎవరో బోధపడుతోంది. అందుకే, పాక్ వైఖరితో విసిగిపోయిన అమెరికా చట్ట సభ సభ్యులు, భారత్ కు అరుదైన గౌరవాన్నిచ్చారు. నాటో దేశాలతో సమానంగా భారత్ తో అమెరికా రక్షణ సంబంధాలు కొనసాగించాలని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మానించింది.
పాకిస్తాన్ లో పాగా వేసిన హకానీ నెట్ వర్క్ ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని అమెరికా ఎప్పటినుంచో చెప్తోంది. ఉగ్రవాదులను కాపాడటమే తప్ప శిక్షించడం తెలియన పాకిస్తాన్ ఆ పని చేయలేదు. అందుకు మూల్యం చెల్లించుకుంది. పాక్ కు 450 మిలియన్ డాలర్ల సహాయం చేయాలని ఇటీవల ఒబామా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అక్కడి చట్ట సభ సభ్యులు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. సహాయం చేయడానికి వీల్లేదంటూ తీర్మానించారు. దీంతో, ఒబామా సర్కార్ నిర్ణయానికి బ్రేక్ పడింది.
స్వాతంత్ర్యం వచ్చినప్పుటి నుంచీ భారత్ కంటే పాక్ వైపే అమెరికా పాలకులు మొగ్గు చూపే వారు. సోవియట్ యూనియన్ తో భారత్ సత్సంబంధాలు నెరపడం అమెరికాకు నచ్చేది కాదు. దీంతో పాక్ ను ప్రోత్సహించడం మొదలైంది. పాక్ ఎన్ని పాపాల చేసినా అమెరికా సర్కార్ కిమ్మనేది కాదు. ఐక్యరాజ్య సమితిలోనూ భారత్ కు సోవియట్ యూనియన్ అండగా ఉండేదే తప్ప అమెరికా వాస్తవాన్ని మాట్లాడేది కాదు.
కాలం మారింది. కొన్ని దశాబ్దాలుగా పరిస్థితిలో మార్పు వస్తోంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతి పెరిగింది. దౌత్య, రక్షణ రంగాల్లో బలం పెరిగింది. పాక్ ఎలాంటి దేశమో అమెరికా తదితర దేశాలకు విడమరచి చెప్పడంలో మోడీ సర్కార్ సఫలమైంది. అందుకే, నాటో మిత్ర దేశాలతో సమానంగా భారత్ తో రక్షణ కొనసాగించాలని అక్కడి చట్టసభ సభ్యులు తీర్మానించారు. నాటోలో అమెరికా, ఐరోపా దేశాలకు సభ్యత్వం ఉంది. వాటితో సమానంగా భారత్ ను గుర్తించడం అంటే, తీవ్రవాదంపై పోరాటంలో ఎవరేంటనేది స్పష్టమైనట్టే. అంతేకాదు, అంతర్జాతీయంగా భారత్ కు మరింత గుర్తింపు వచ్చినట్టే.